షేక్ హసీనా లండన్‌కు వెళ్లే ప్రయత్నాన్ని ఎందుకు విరమించుకున్నారు?

బంగ్లాదేశ్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం రద్దు కావడానికి ముందు నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అంగీకరించారు.

Update: 2024-08-06 13:00 GMT

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు భారత్‌ సాయం చేస్తుందని, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునేందుకు ఆమెకు సమయం ఇచ్చిందని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం (ఆగస్టు 6) అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె దేశం వీడి సోమవారం సాయంత్రం ఇండియా చేరుకున్న విషయం తెలిసిందే. పార్లమెంటు హౌస్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జైశంకర్ మాట్లాడారు.

కొత్త ప్రభుత్వానికి యూనస్ సారథ్యం..

బంగ్లాదేశ్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం రద్దు కావడానికి ముందు నోబెల్ గ్రహీత డాక్టర్ ముహమ్మద్ యూనస్ కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అంగీకరించారు. యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా చేయాలనే డిమాండ్‌ను వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు తెచ్చారు.

440 మంది మృతి..

షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం విడిచి వెళ్లారు. అంతకుముందు చెలరేగిన హింసాకాండలో 440 మంది చనిపోయారు. హసీనా దేశం వీడారన్న వార్త తెలియగానే వందలాది ప్రజలు ఆమె నివాసంలోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. మంగళవారం ఉదయానికి ఢాకాలో పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది. పరిస్థితుల్లో మార్పు కనిపించింది. వ్యాపారులు దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి పుంజుకుంది.

తొలుత లండన్‌కు వెళ్లాలనుకున్నారా?

హసీనాను భారతదేశానికి తీసుకువచ్చిన బంగ్లాదేశ్ వైమానిక దళం విమానం.. ఉదయం 9 గంటలకు బంగ్లాదేశ్‌కు తిరిగివెళ్లింది. భారత్‌కు బయలుదేరే కంటే ముందు లండన్ వెళ్లాలనుకున్నారు. అక్కడ షేక్ హసీనా సోదరి రెహానా కూతురు తులిప్ సిద్ధిక్ బ్రిటీష్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలసచట్టాలు అంగీకరించవని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె భారత్‌కు పయనమయ్యారు. సోమవారం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో దిగారు. ఆమె మరో రెండు, మూడు రోజుల్లో భారతదేశం నుంచి వెళ్లే అవకాశం లేదు.

ఫిన్లాండ్‌కు వెళ్తారా?

బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హసీనా లండన్ కు వెళ్లే అవకాశం లేదు. ఫిన్లాండ్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. అక్కడ ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిసింది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News