బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కాంట్రాక్టు..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మర్డర్‌కు ప్లాన్ చేసిందెవరు? కిరాయి హంతకులు ఎన్ని లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారు?

Update: 2024-07-02 11:12 GMT

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ రూ. 25 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

ముంబాయిలోని బాంద్రాలో సల్మాన్ ఇంటిపై ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఆ సమయంలో సల్మాన్‌ఖాన్‌ ఇంట్లో ఉండడంతో ప్రమాదం తప్పింది. తర్వాత సల్మాన్ ఖాన్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వీరిద్దరికి ఇప్పటికే జైలులో ఉన్నగ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలున్నాయని విచారణలో నిర్ధారించారు.

చార్జ్‌షీట్ ప్రకారం..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య సల్మాన్‌ను చంపడానికి ప్లాన్ వేసింది. అయితే హత్య చేయడానికి కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

అధునాతన తుపాకుల కొనుగోలు..

సల్మాన్‌ను హతమార్చేందుకు పాకిస్థాన్ నుంచి ఏకే-47, ఏకే-92, ఎం16 రైఫిల్స్‌తో పాటు టర్కీలో తయారైన జిగానా పిస్టల్‌ సహా అధునాతన తుపాకులను కొనుగోలు చేసేందుకు ముఠా ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు జిగానా పిస్టల్ ఉపయోగించడంతో.. ఆ హత్య కూడా బిష్ణోయ్ గ్యాంగ్‌ పనేనని అనుమానిస్తున్నారు.

సల్మాన్ హత్యకు రెక్కీ..

చార్జీషీట్‌ ప్రకారం..60 నుంచి 70 మంది సల్మాన్ కదలికలను గమనించడంలో నిమగ్నమయ్యారు. తుపాకీతో కాల్చిచంపేందుకు అనువైన ప్రదేశాల కోసం అన్వేషించారు. సల్మాన్‌ను సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు లేదంటే తన పన్వెల్ ఫామ్‌హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు హత్య చేయాలని మొదట ప్లాన్ చేశారు. ఆ తర్వాత మరో రెండు ప్రదేశాలు అనువైనవని భావించారు. అవి సల్మాన్ ముంబై నివాసం, గోరేగావ్ ఫిల్మ్ సిటీ.

గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి వద్ద ఉన్న కిరాయి హంతకులలో చాలా మంది మైనర్లేనని తెలుస్తోంది.

సల్మాన్ నివాసం వెలుపల కాల్పుల ఘటనలో పోలీసులు ఒక నిందితుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులోని ఆడియో అన్మోల్ బిష్ణోయ్ వాయిస్‌తో సరిపోయింది. సల్మాన్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలని అన్మోల్ వారికి చెప్పి.. ఈ ఏడాది మార్చి 15న ఆయుధాలను సమకూర్చాడు. 

Tags:    

Similar News