ప్రభుత్వ భూమిని అమ్మకుండా ఒక చట్టం చేయాలి
నగరంలో 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల అవసరాలకు ఉపయోగించాలి
-నారగోని ప్రవీణ్ కుమార్
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలని ప్రజలకు ఉద్యోగాలు లభించాలని పారిశ్రామికవేత్తలకు ఆనాటి ప్రభుత్వాలు పరిశ్రమలను స్థాపించడానికి 99 సంవత్సరాల లీజుకు ప్రభుత్వ భూములను కేటాయించటం జరిగింది, ఇందులో ఆజామాబాద్, బాలనగర్, మల్లాపూర్, కుషాయిగూడ లాంటి ప్రాంతాలు ఉన్నవి,
హైదరాబాదు నగరం అభివృద్ధి చెందడం వలన ఈ పరిశ్రమల నుండి వచ్చే పొల్యూషన్ నగర ప్రజలను ఇబ్బందికి గురి చేస్తుందని హైదరాబాద్ నగరం నుండి దూరంగా పరిశ్రమలను పంపించాలని గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది , అయితే ఏ పరిశ్రమలకు ఎంత భూమిని 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు అంతే భూమిని లేకుంటే అంతకంటే ఎక్కువ భూమిని నగరం అవుతల పరిశ్రమలలో స్థాపించడానికి ప్రభుత్వము భూమి కేటాయించాలి, నగరంలో 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజల అవసరాలకు ఉపయోగించాలి.
ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో లాలూచీపడి వారికి సుమారు 9,292 ఎకరాల ఇండస్ట్రీయల్ ప్రభుత్వ భూమికి యజమాన్య హక్కులు కల్పించడం పెద్ద కుంభకోణంగా భావించవచ్చును
ప్రభుత్వ భూములు అంటే ప్రజలకు సంబంధించిన భూములు ప్రజలందరికీ ఈ భూములపై హక్కులు ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎవరికి పడితే వాళ్లకు యజమాన్య హక్కులు ఇవ్వడానికి కుదరదు, ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చిన వాళ్లకు పంచమని ప్రజలు ఓటు వేసి వీరిని గెలిపిస్తున్నారా?
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమైనా శాకాహారులా? ఆ భూమిని ఇండస్ట్రిరియల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ లో కి మారుస్తూ జీవో (Hyderabad Industrial Lands Transformation Policy (HILTP) 2025) జారి చేశారు
దీనితో ఏమవుతుందంటే ఆ పరిశ్రమలు స్థాపించిన పారిశ్రామకవేత్తలు ఈ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్ముకోవడానికి ఆస్కారం కల్పించారు దీనితో లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరనుంది ఇందులో ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా కొంత ముడుపులు ముట్టే అవకాశం స్పష్టంగా కనబడుతుంది దానికోసమే ఈ నిర్ణయం జరిగి ఉంటుంది అనేది ప్రజాభిప్రాయం, ఈ భూమిని ప్రభుత్వమే అమ్మితే తెలంగాణకున్న అప్పును చెల్లించవచ్చును, లేదంటే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా అభివృద్ధి పర్చ వచ్చును , ప్రభుత్వ దావఖానాలను కార్పొరేట్ లెవల్లో అభివృద్ధి పర్చి ఒక్క పైసా ప్రజలకు వైద్యానికి ఖర్చు కాకుండా ఉచితంగా వైద్య సేవలను అందించవచ్చును, తెలంగాణలో ఉన్న ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వవచ్చును, ప్రజలు ఈ ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రతిపక్ష పార్టీలు గొంతు విప్పి ఉద్యమాన్ని చేపట్టాలి లేదంటే ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతమైపోయి భవిష్యత్తులో ప్రజల అవసరాలకు భూమి లేకుండా అయిపోతుంది.
ప్రభుత్వ భూమిని అమ్మకుండా ఒక చట్టం చేయాలి
ప్రజల అవసరాల కోసం స్థాపించే వివిధ పరిశ్రమలకు లీజుకు ఇస్తూ లీజ్ కాలం అయిపోయిన తర్వాత ప్రభుత్వము ఆ భూమిని స్వాధీనం చేసుకొని మరొక పరిశ్రమ స్థాపించే వారికి లీజ్ కి ఇచ్చే పద్ధతి తీసుకువస్తే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుంది ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఈ విషయంపై కోర్టులో కేసు వేసి వాదించాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదంటే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోతుంది, ప్రజా అవసరాల కోసం ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు కొనాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు , ప్రజలు ఓటు ద్వారా పాలకులను ఎన్నుకునేది ప్రజలు కట్టినటువంటి పన్నులను సక్రమంగా ప్రజా అవసరాలకు ఉపయోగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుకుంటారు
(నారగోని ప్రవీణ్ కుమార్, ప్రెసిడెంట్ , తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్, హైదరాబాద్)