లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా..

హోరెత్తిన నిరసనలతో సభ రెండు సార్లు వాయిదా..;

Update: 2025-08-20 10:30 GMT
Click the Play button to listen to article

కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) బుధవారం (ఆగస్టు 20) లోక్‌సభ(Lok Sabha)లో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు-2025, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టి.. వాటిని పార్లమెంటు ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపారు. 21 మంది లోక్‌సభ ఎంపీలను స్పీకర్ నియమిస్తారు. 10 మంది రాజ్యసభ ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నియమిస్తారు. పార్లమెంటు తర్వాత సమావేశాల మొదటి రోజున జాయింట్ కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది.


ఒవైసీ ఆరోపణ..

ఇండియా బ్లాక్ ఎంపీల నిరసన మధ్య AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Owaisi)..బిల్లులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. అవి‘‘రాజ్యాంగ విరుద్ధం’’గా ఉన్నాయని పేర్కొన్నారు.


‘ఆర్టికల్ 21ఉల్లంఘన'

కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా బిల్లులను వ్యతిరేకించారు. ఆర్టికల్ 21కి ఉల్లంఘించే ఈ బిల్లులు దర్యాప్తు సంస్థల రాజకీయ దుర్వినియోగానికి ద్వారాలు తెరిసేలా ఉన్నాయన్నారు. మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని తివారీ డిమాండ్ చేశారు.

ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్‌కె ప్రేమచంద్రన్ కూడా బిల్లులను వ్యతిరేకించారు. తొందరపాటుగా తీసుకొచ్చిన బిల్లులు పార్లమెంటరీ వ్యవహారాల నియమాలను ఉల్లంఘిస్తున్నాయని వాదించారు. వెంటనే జోక్యం చేసుకుని షా..పరిశీలన కోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

గుజరాత్ హోంమంత్రిగా ఉన్న కాలంలో అరెస్టు అయిన తర్వాత రాజీనామా చేశారా? అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. రాజకీయ ప్రేరేపిత కేసులో అరెస్టయినప్పుడు నైతికంగా రాజీనామా చేశానని చెప్పారు.


సభ రెండుసార్లు వాయిదా..

ప్రతిపక్షాల గందరగోళం కారణంగా లోక్‌సభ వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి సమావేశమైంది. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు. 

Tags:    

Similar News