చత్తీస్ గడ్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత లొంగుబాటు

సిఎం విష్ణుదేవ్ ముందు రామ్ ధేర్ తో సహా 12 మంది మావోయిస్టుల లొంగుబాటు

Update: 2025-12-08 10:50 GMT

మావోయిస్టు పార్టీకి మరొక షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్‌ సోమవారం లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12మంది సాయుధ మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌ సిఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోయారు. రామ్‌ధేర్ ఎంఎంసీ జోన్‌‌లో సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆయనపై రూ.కోటికి పైగా రివార్డ్ ఉంది. రామ్‌ధేర్ కీలక దాడుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఆరుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.

కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రకటన తర్వాత మావోయిస్టుల లొంగుబాట్లు , ఎన్ కౌంటర్లు ఎక్కువయ్యాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత ఆ పార్టీ కకా వికలమైంది. బస్వరాజ్ వంటి కీలక నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. జనవరి నుంచి ఆయుధాలు త్యజించినట్టు, జనజీవన స్రవంతిలోకి రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని మావోయిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది.చత్తీస్ గఢ్ లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. ఇటీవలె నారాయణ్ పుర్ జిల్లాలో మరో 28మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయినవారిలో మాడ్ డివిజన్ కమిటీ సభ్యులు, పిఎల్ జిఏ ఏరియా కమిటీ సభ్యులు, మిలిటరీ దళం కమాండర్ , ఎల్ ఒఎస్ , జనతం సర్కార్ సభ్యులు ఉన్నారు. దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించిన 22 మంది మావోయిస్టులపై 89లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. జనజీవన స్రవంతిలో కలిసినవారిలో 19 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామాభివృద్ధి పథకంతోపాటు నూతన లొంగుబాటు, పునరావాస విధానానికి ఆకర్షితులై హింసాపథం వీడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఎస్ ఎల్ఆర్ , ఒక ఇన్సాస్ రైఫిల్ , ఒక 303 రైఫిల్ అప్పగించినట్లు చెప్పారు. బస్తర్ డివిజన్ ప్రాంతంలో గత 50 రోజుల్లో 512 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News