రాజ్యాంగాన్ని రద్దు చేసిన వారు, ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నారు: మోదీ
రాజ్యాంగాన్ని రద్దు చేసి, దేశాన్ని జైలుగా మార్చిన వారు ఇప్పుడు రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారని ప్రధాని అన్నారు. వారికి ఈ భావన ఇంకా సజీవంగా ఉందని..
By : The Federal
Update: 2024-06-25 09:39 GMT
దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్, పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను లాక్కుందని, ప్రతి పౌరుడు పవిత్రంగా భావించే రాజ్యాంగాన్నితుంగలో తొక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇప్పుడు వీరే రాజ్యాంగంపై ప్రేమను ఒలకబోస్తున్నారని అన్నారు.
1975-77 లో దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని చీకటి రోజులుగా అభివర్ణించిన ప్రధాని, హక్కుల కోసం పోరాడిన నాయకులను స్మరణ చేసుకున్నారు. అత్యవసర పరిస్థితి విధించి 49 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఉద్దేశించి విమర్శలు ఎక్కు పెట్టిన ప్రధాని.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ పాలనతో ప్రజలను హింసించిన పార్టీలకు రాజ్యంగం పై ప్రేమ ఉందని చెప్పుకునే హక్కు లేదని ఉద్ఘాటించారు.
"ఈ వ్యక్తులు లెక్కలేనన్ని సందర్భాలలో ఆర్టికల్ 356 ను విధించారు, పత్రికా స్వేచ్ఛను నాశనం చేయడానికి బిల్లును తెచ్చారు. ఫెడరలిజాన్ని నాశనం చేశారు. రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు" అని ప్రధాని విమర్శించారు.
"ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం, దానిని విధించిన పార్టీలో ఇంకా సజీవంగా ఉందన్నారు. వారు తమ టోకెనిజం ద్వారా రాజ్యాంగం పట్ల తమకున్న ద్వేషాన్ని దాచిపెట్టారు, కానీ దేశ ప్రజలు వారి చేష్టల ద్వారా ఈ పరిస్థితిని గమనించారు. అందుకే వారిని తిరస్కరించారు. ఇది ఒక్కసారే కాదు.. పదే పదే జరిగింది" అన్నారు.
అధికారం కోసమే దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించిందని, దేశం మొత్తాన్నే జైలుగా మార్చి వేసిందని విమర్శల వర్షం కురిపించారు. ప్రతిపక్షాలు, పార్టీ సిద్ధాంతంతో విభేదించే వారందరిని పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారని అప్పటి విషయాలను గుర్తు చేశారు. "బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని సామాజికంగా తిరోగమన విధానాలు అవలంబించారని" అని ప్రధాని అన్నారు.
జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు, పౌర హక్కులను సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నాయకులు, అసమ్మతివాదులను జైలులో పెట్టారు. పత్రికా సెన్సార్‌షిప్‌ను అమలు చేశారు. మంగళవారం నాటి వార్షికోత్సవం ఎమర్జెన్సీని ఎదిరించిన ‘మహా పురుషులందరికీ’ నివాళులర్పించే రోజు అని మోదీ అన్నారు. 18వ లోక్‌సభ తొలిరోజు సోమవారం ఎమర్జెన్సీ విధింపుపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మధ్య మాటల యుద్ధం జరిగింది.