ఫ్యూచర్ సిటిలో జూ ఏర్పాటుకు ఒప్పందం..
వంతారా తరహా జూ ఏర్పాటుకు ముందుకొచ్చిన యాజమాన్యం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో రాష్ట్రానికి మరో కీలక ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని వన్యప్రాణి పునరావాస కేంద్రం ‘వంతారా’ హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీలో ఆధునిక జూ పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వన్యప్రాణి సంరక్షణ, పునరావాసంలో పేరుపొందిన వంతరా (Vantara) సంస్థతో పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ జూ తెలంగాణలో నిర్ణయించిన ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి పర్యావరణ పరిరక్షణ–పర్యాటక అభివృద్ధికి ఈ ఒప్పందం కీలకమని అన్నారు. జూ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై సంతక కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, అటవీ దళాల ప్రధాన అధికారి డాక్టర్ సి. సువర్ణ, అటవీ అభివృద్ధి సంస్థ MD సునీత భగవత్ తదితరులు పాల్గొన్నారు.
వంతరా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముకేశ్ అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న వన్యప్రాణి రక్షణ సంస్థగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. జంతు సంరక్షణ, పునరావాసం, నైట్ సఫారీ డిజైన్, ఆధునిక ఎంక్లోజర్లు, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసుల అమలులో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది.
MoUలో ప్రధాన అంశాలు
జంతు సంరక్షణ, పునరావాసంలో వంతరా సాంకేతిక మార్గదర్శకత్వం
నైట్ సఫారీ, అడ్వెంచర్ జోన్‌ల రూపకల్పన
ఫారెస్ట్–బేస్డ్ ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి
పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో జూ అభివృద్ధి వ్యూహాలు
సందర్శకుల అనుభవం, భద్రత, మౌలిక సదుపాయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు
ఆసియాలోనే అత్యాధునిక మోడల్
వంతరా నైపుణ్య సహకారంతో కొత్తగా నిర్మించబోయే ఈ జూ దేశంలోనే కాక ఆసియా ఖండంలో కూడా అత్యాధునిక మోడల్ జూగా నిలిచే అవకాశముందని అధికారులు అంటున్నారు. పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణి సంక్షేమం, అంతర్జాతీయ స్థాయి పర్యాటక అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.