ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల పోరు తప్పదా?

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణలు మొదలు కానున్నాయా?

Byline :  The Federal
Update: 2023-12-13 01:13 GMT
YS Jagan and YS Sharmila (file photo)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఉండగా అరెస్టై జైలుకు వెళ్లిన సందర్భంలో అన్నీ తానై పాదయాత్రను కొనసాగించిన వైఎస్‌ షర్మిల అప్పట్లో ‘నేను జగనన్న వదిలిన బాణాణ్ణి’ అంటూ సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఇదే అస్త్రాన్ని జగన్‌పైకే ప్రయోగించనుందా అనే చర్చ ఉత్కంఠకు తెరలేపింది. దీనిని ఏ వర్గం ఖండించపోవడం కూడా బలాన్ని చేకూరుస్తుంది. వైఎస్‌ షర్మిల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైనట్లుగానే కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవిలో ఉన్న పేరు రాయడానికి ఇష్టపడని ఒక నాయకుని అభిప్రాయం ప్రకారం ‘షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావడం ఖచ్చితం. సోనియాగాంధీ కూడా ఆమేరకు డైరెక్షన్‌ ఇచ్చినట్లు’గానే ఆయన చెప్పారు. తెలంగాణ ఎన్నికలకు ముందే ఇదంతా జరిగింది. దీని కోసం షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్టానం దిశ నిర్దేశం చేసినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, షరతులు లేకుండా కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి విజయానికి కృషి చేయడం జరిగిపోయాయి.

రోడ్డు మ్యాప్‌ తయారు
ఆగస్ట్‌ 31న ఢిల్లీ టెన్‌ జన్‌పథ్‌లోని సోనియాగాంధీ ఇంట్లో జరిగిన భేటీలో ఒక రోడ్డు మ్యాప్‌ తయారైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఈ ఫార్ములా తెలంగాణ ఎన్నికల్లో సత్ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అందలం ఎక్కడంతో కాంగ్రెస్‌ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఆంధ్ర రాజకీయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించాయి. స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైన కూతురుగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఎక్కడ తగ్గాలో తెలిసిన నైనాజాన్ని ప్రదర్శించింది షర్మిల. తన రాజకీయ పరిణతిని చాటుకుని కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. కర్నాటక అనుభవంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దానికి కొనసాగింపుగా వైఎస్‌ చరిష్మాను ఉపయోగించుకుని షర్మిల నాయకత్వ పటిమతో పకడ్బంధీ రోడ్డు మ్యాప్‌తో ఆంధ్రలో సైతం అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రస్థాయి కసరత్తు మొదలు పెట్టింది.
ఈ బాణం అన్నపైకే..
ఈ బాణం ఖచ్చితంగా అన్నపైకే సంధించాల్సి రావడం రాజకీయాల్లో ఒకింత నాటకీయ పరిణామంగానే చెప్పవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన షర్మిల ఆంధ్ర రాజకీయాలపై తన ముద్రను వేయనుంది. అన్నతోటి ఢీ అంటే ఢీ అనే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
జగన్‌ అధికారం చేపట్టగానే క్రమంగా దూరమైన షర్మిల
2019 జనవరి 27న ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి అన్నతో కలిసి వెళ్లిన షర్మి ల ఆ తరువాత క్రమంగా దూరమవుతూ వచ్చారు. ఎన్నికల తరువాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ను ఆయన తల్లి విజయమ్మ ఆశీర్వదించారు. ఆ తరువాత ఆమె కూడా షర్మిలకే దగ్గరయ్యారు. ఇరువురూ కలిసి తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించి హైదరాబాద్‌లోనే ఉంటూ వచ్చారు.
ఆతరువాత జరిగిన వైఎస్సార్‌ వర్థంతి, జయంతి లాంటి కార్యక్రమాలకు వేరువేరుగా వచ్చి నివాళులర్పించారు. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. 2019లో వైఎస్సార్‌ వర్థంతి కార్యక్రమానికి పులివెందుల వచ్చినప్పుడు ఇరువురి మధ్య ఇడుపులపాయ ఎస్టేట్‌లోనే అభిప్రాయ బేధాలు ఏర్పడి ఎడమొఖం, పెడమొఖంగా ఉన్నారు. ఆ తరువాత పూర్తి స్థాయిలో దూరంగానే ఉన్నారు. దీనికి కుటుంబంలోని అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని, ఇప్పటికీ ఆ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి.
అసంతృప్తి వాదులను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యం
సీఎం జగన్‌ వ్యవహారశైలి నచ్చని వైఎస్‌ అంతరంగికులు, ఆత్మీయులు, అభిమానులు ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీని వీడుతున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోని అసంతృప్తి వాదులను ఏకం చేసి తెరపైకి తీసుకు రావడానికి షర్మిలను అదను చూసి కాంగ్రెస్‌ రంగంలోకి దించి అస్త్రంగా ప్రయోగించనుంది. ఇటీవల వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే అది నిజమేనని పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. కర్నాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేసి ఏపీలో కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. ఇందుకు షర్మిల కూడా సుముఖంగానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఏపీ రాజకీయాల్లో తన చెల్లెలు వేరొక పార్టీలో ఉంటే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని తల్లివద్ద సీఎం జగన్‌ వాపోయినట్లు సమాచారం. తల్లి విజయమ్మ కోరిక మేరకు కొద్ది రోజులు వేచి చూద్దామనే ఆలోచనలో షర్మిల ఉందని, ఏ క్షణమైనా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం లేకపోలేదని షర్మిల అత్యం సన్నిహితులు చెబుతున్నారు.
కుటుంబంలో ఎవరి ఇష్టం వారిదే..
రాజకీయాల్లో కుటుంబ సభ్యులు తలా ఒక పార్టీలో ఉండటం చూశాం. ఎవరికి ఏ పార్టీ సిద్దాంతాలు నచ్చుతాయో వారు ఆపార్టీలో ఉంటారు. దీనిని ఎవ్వరూ కాదనలేరు. రాయల సీమ నుంచి నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా ఆయన తమ్ముడు నీలం రాజశేఖర్‌రెడ్డి సీపీఐలో ఉన్నారు. సంజీవరెడ్డి బావమరిది తరిమెల నాగిరెడ్డి సీపీఐఎంఎల్‌ న్యూ డెమొక్రసీలో పనిచేశారు.
ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు టిడిపికాగా, వదిన పురందేశ్వరి గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆనం సోదరుల్లో ఒకరు వైఎస్సార్‌సీపీలో ఉండగా మరొకరు తాజాగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీకి దగ్గరయ్యారు.
అదే కోవలో మేకపాటి సోదరుల్లో ఒకరు వైఎస్సార్‌సీపీలో ఉండగా మరొకరు ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.
తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి వైదొలిగారు. ఆయన అన్న అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్‌సిపిలోనే కొనసాగుతున్నారు. అంటే ఒకే కుటుంబంలో ఎవరికి వారు ఏపార్టీలోనై ఉండవచ్చనేది సర్వసాధారణమైనా వైఎస్‌ జగన్, వైఎస్‌ షర్మిల ఉదంతం మాత్రం రాష్ట్ర రాజకీయాలను కుదిపే అవకాశం ఉంది.
అంతే కాకుండా ఎవరికి వారు మనసుకు నచ్చిన పార్టీలో ఉండే స్వేచ్చ వారికి ఉంది. కట్టడి అనేది కొంతకాలం వరకు ఉంటుందేమోకాని తర్వాత దానిని ఆపలేరు. అంటే షర్మిల తన అభిమతానికి అనుగుణంగా అడుగులు వేస్తుందనడంలో సందేహం లేదు.
షర్మిల, జగన్‌లలో జనం ఎవరిని కోరుకుంటారు!
షర్మిల డాక్టర్‌ వైఎస్సార్‌ చరిష్మాను ఉపయోగించుకోవాలని చూస్తుంది. అదే చరిష్మాను ఉపయోగించుకుని జగన్‌ అధికారాన్ని అనుభవిస్తున్నారు. అయితే జగన్‌లో వైఎస్సార్‌ మార్క్‌ కనిపించడం లేదని పలువురు వైసీపీ నాయకులు వాపోతున్నారు. వీరిద్దరిలో జనం ఎవరిని కోరుకుంటారు. విజయమ్మ తీసుకోబోయే స్టాండ్‌ ఎలా ఉంటుంది? తెలంగాణలో పోటీ చేస్తానని విజయమ్మ చెప్పింది. కానీ పోటీనుంచే తప్పుకుని కాంగ్రెస్‌ను అందలమెక్కించడమే లక్ష్యంగా మద్దతు ఇచ్చి సఫలీకృతమైంది.
ఏపీలో జరగబోతున్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలోకి వైఎస్‌ షర్మిల వస్తే బాగుంటుందని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ కుమార్తెగా ఆమె రాకను ఆహ్వానిస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, వైఎస్‌ కుటుంబానికి అత్యంత ఆప్తుడు డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి ఫెడరల్‌తో అన్నారు.


Tags:    

Similar News