బీహార్‌లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్..
తొలి జాబితాలో లేని ప్రశాంత్ కిషోర్ పేరు.. అక్టోబర్ 10, లేదా 11 వ తేదీల్లో రెండో జాబితా విడుదల..
బీహార్ (Bihar)లో అసెంబ్లీ ఎన్నికలకు(Assembly polls) డేట్ ఫిక్సయ్యింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (JSP) చీఫ్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) 51 మందితో అభ్యర్థుల తొలి జాబితాను గురువారం (అక్టోబర్ 9) విడుదల చేశారు. ఈ జాబితాలో రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. 51 మందిలో ఆరుగురు ముస్లింలు, ఒక ట్రాన్స్‌జెండర్, 17 మంది అత్యంత వెనుకబడిన తరగతి (EBC)కి చెందిన వారు , 11 మంది వెనుకబడిన తరగతులు (BC), ఏడుగురు షెడ్యూల్డ్ కులాలు, ఏడుగురు మైనారిటీ సమాజం, 9 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు సమాచారం.
రాజకీయాల్లో అవినీతి గురించి గళం విప్పిన కిషోర్.. అభ్యర్థుల ఎంపికలో కూడా అంతే జాగ్రత్తగా, పారదర్శకతతో వ్యవహరించారని అభ్యర్థుల ఎంపికను బట్టి తెలుస్తోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న అనేక మంది మాజీ అధికారులు, పోలీసు అధికారులను ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ప్రముఖల పేర్లలో ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, పాట్నా విశ్వవిద్యాలయ మాజీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ కె.సి. సిన్హాను కుమ్రార్ నియోజకవర్గం నుంచి బరిలో దింపుతున్నారు. సిన్హా గత మూడు దశాబ్దాలుగా 70 కి పైగా గణిత పాఠ్యపుస్తకాలను రాశారు.
జాబితాలో బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు..
మరో ప్రముఖ వ్యక్తి యదు వంశ్ గిరి. మాంఝీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న గిరి..అదే కోర్టులో బీహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా, కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు.
ముజఫర్‌పూర్ నుంచి పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి డాక్టర్ అమిత్ కుమార్ దాస్‌ను పోటీకి నిలిపింది. ఈయన భార్య కూడా వైద్యురాలు. ముజఫర్‌పూర్‌లో ఆసుపత్రిని నడుపుతున్న అమిత్ కుమార్ దాస్.. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌గా పేరుగాంచారు.
ప్రశాంత్ కిషోర్ పేరు మొదటి జాబితాలో లేకపోవడంతో ఆయన స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆర్జేడీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ బలమైన కోట రాఘోపూర్ నుంచి లేదా తన సొంత నియోజకవర్గం కర్గహర్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.
ఇక సీనియర్ జెఎస్పీ నాయకుడు ఆర్కె మిశ్రా దర్భంగా టౌన్ నుంచి పోటీ చేయనుండగా, కిషోర్ కుమార్ మున్నా సహర్సా నుంచి పోటీ చేస్తున్నారు.
ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ రంజన్ పాండే రోహ్తాస్ జిల్లాలోని అగ్ర కుల బ్రాహ్మణుల ఆధిపత్యం ఉన్న కార్గహర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
రేపు రెండో జాబితా..
అక్టోబర్ 10 లేదా 11 తేదీల్లో అభ్యర్థుల రెండోజాబితాను విడుదల చేస్తామని పార్టీ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ ప్రకటించారు.తొలి జాబితా ప్రకటన సమయంలో కిషోర్ హాజరు కానప్పటికీ..అక్టోబర్ 11న రాఘోపూర్ (వైశాలి) నుంచి పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.