జూబ్లీహిల్స్ పోటీకి కాంగ్రెస్ నేతను ప్రతిపాదించిన బీజేపీ ఎంపీ..?

రేసులో లేనని చెప్పిన బొంతు రామ్మోహన్.. గురువారం బీజేపీ నేత ప్రతిపాదన.

Update: 2025-10-09 13:35 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌కు గెలుపు గుర్రాలను సిద్ధం చేయడంలో రాజకీయ పార్టీలన్నీ బిజీ అయ్యాయి. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థి మాగంటి సునీత అని ప్రకటించేసింది. కాగా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిపై కసరత్తులు చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ.. ఎన్నికల మేనేజ్‌మెంట్ సమావేశం నిర్వహించింది. ఇందులో ఎవరూ ఊహించని ఘటన జరగింది. అదేంటంటే.. బీజేపీ అభ్యర్థి కోసం సమావేశమైతే అందులో కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. బొంతు రామ్మోహన్‌ పేరును నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రతిపాదించారు. ఆయన మంచి వ్యక్తి అని, ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందని అన్నారు. ఈ సమావేశం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర‌రావు అధ్యక్షతన జరిగింది. ఇందులో పలువురు నేతలు తమకు తోచిన అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించారు. అయితే అర్వింద్.. బొంతు రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

పోటీలో లేనన్న బొంతు..

ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టికెట్ రేసులో తన పేరు పదేపదే వినిపిస్తున్న క్రమంలో బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు. తాను రేసులో లేనని చెప్పారు. దాంతో నవీన్ యాదవ్‌కు దాదాపు లైన్ క్లియర్ అయిపోయిందని అంతా అనుకున్నారు. ‘‘నేను టికెట్ అడగలేదు. అభ్యర్థిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎప్పుడూ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తా. జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం నలుగురు పేర్లను పీసీసీ ప్రతిపాదించింది’’ అని ఆయన వెల్లడించారు. ఇంతలో ఇప్పుడు ఆయన పేరును బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింత్ ప్రతిపాదించడం కీలకంగా మారింది. ఈ అంశం తీవ్ర చర్చలకు కూడా దారితీస్తోంది.

పార్టీ మారడానికి ఓకే చెప్పారా..?

తనకు టికెట్ ఇస్తే పార్టీ మారతానని బొంతు రామ్మోహన్ చెప్పారా? ఆయన ఆ మాట చెప్పడంతోనే అర్వింద్.. అతని పేరును ప్రతిపాదించారా? అన్న చర్చ బలంగా జరుగుతోంది. అలా కాని పక్షంలో బీజేపీ అభ్యర్థి స్థానంలోకి కాంగ్రెస్ నేత పేరు ఎందుకు ప్రతిపాదిస్తారు? అని అడుగుతున్నవారు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడు మారతారు? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తనకు టికెట్ కన్‌ఫర్మ్ అయిన తర్వాత మారతారా? బీఫాం తీసుకున్నాక కండువా మారుస్తారా? అనేది కూడా హాట్ టాపిక్‌గా ఉంది.

బీజేపీ ఓకే చెప్తుందా..

బొంతు రామ్మోహన్‌.. భారీ సౌండ్ పార్టీ. పోటీలో నిలబడితే గెలిచే అవకాశాలు బాగానే ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజవకర్గ సర్కిల్స్‌లో వినిపిస్తున్న చర్చలివి. దీంతో గెలుపు అవకాశాలు ఉన్న బొంతు రామ్మోహన్‌ను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ టికెట్ ఇస్తుందా? అంటే విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పక్క పార్టీల నుంచి నాయకులను లాక్కుంటుంది? అన్న అపవాదు బీజేపీపై బాగానే ఉంది. అందులోనూ కాంగ్రెస్ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయాల్లో తమ ఎమ్మెల్యేలను పక్క రాష్ట్రాలకు పంపిన సందర్భాలు కూడా అనేకంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు గెలుస్తారు అని.. కాంగ్రెస్ నాయకుడిని పిలిచి పార్టీ కండువా కప్పి.. తమ తరుపున జూబ్లీహిల్స్ పోటీలో నిలబెడుతుందా? అన్నది అందరి నుంచి వినిపిస్తున్న ప్రశ్న. కాకపోతే ముందే పార్టీ మారి.. ఆ తర్వాత ప్రతిపాదించబడటం, టికెట్ రావడం అంటే వేరు కానీ.. ఇప్పుడున్న పరిస్థితి వేరు కాబట్టి.. బీజేపీ నో చెప్పొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News