ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు భారీ షాక్ !

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు.

Update: 2025-12-11 11:16 GMT

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఐదు నెలల నుంచి సిట్ చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును కస్టడీకి అప్పగించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ కేసు టేకప్ చేసినప్పటి నుంచి సిట్ అధికారులకు ప్రభాకర్ రావు అతిపెద్ద ఛాలెంజ్‌గా మారారు. చాలా కాలం పాటు విదేశాల్లో ఉండి భారత్‌కు రావడానికి నిరాకరించారు. ఎట్టకేలకు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ప్రభాకర్ రావు.. ఇండియాకు తిరిగొచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో పాల్గొన్నారు. కాగా అప్పటి నుంచి ఆయన కస్టడీ కోసం సిట్ అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనను కస్టడీకి ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం మాత్రం నిరాకరించింది. అయితే తాజాగా గురువారం జరిగిన విచారణలో సిట్, ప్రభాకర్ రావు మధ్య ఐదు నెలలుగా సాగుతున్న టామ్‌అండ్ జెర్రీ ఆటకు న్యాయస్థానం ఫుల్ స్టాప్ పెట్టింది.

ప్రభాకర్ రావుకు అందించిన మధ్యంతర రక్షణను తొలగిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో సిట్ అధికారి ఏసీపీ వెంకటరత్నం ముందు లొంగిపోవాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌ల ధర్మాసనం ప్రభాకర్ రావును ఆదేశించింది. అయితే విచారణలో ప్రభాకర్ రావును టార్చర్ పెట్టొద్దని అధికారులకు స్పష్టం చేసింది. దాంతో పాటుగా ప్రభాకర్ రావుకు ఇంటి భోజనాన్ని తీసుకెళ్లడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. శుక్రవారం ఆయన విచారణను పర్యవేక్షించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

అయితే ఈ కేసులో ప్రభాకర్ రావుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా ఈ వాదనల్లో.. ప్రభాకర్ రావును కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరారు. ఆయన విచారణకు ఏమాత్రం సహకరించం లేదని, కీలక ఆధారాలను చెరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది పేర్కొన్నారు.

జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ, “కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడంతో దర్యాప్తుకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీనిపై మీ స్పందన ఏమిటి?” అని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించారు.

దానికి ఆయన, పిటిషనర్‌ దర్యాప్తుకు సహకరిస్తున్నారనే వివరాలను పొందుపరిచిన అఫిడవిట్‌ను ఇప్పటికే దాఖలు చేశామని తెలిపారు. అయితే ఆ అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమర్పించడంతో, దానిని పరిశీలించే అవకాశం లేకపోయిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం జరిగిన విచారణలో తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ప్రభాకర్‌రావు సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News