తెలంగాణ ఎంపీలకు మోదీ ఫుల్లు క్లాస్ ?
టిఫెన్ పెట్టి మరీ మోదీ ప్రజాప్రతినిధులకు తలంటారు
గతంలో ఎప్పుడూ లేనట్లుగా నరేంద్రమోదీ తెలంగాణ ఎంపీలు, ఎంఎల్ఏలకు ఫుల్లుగా క్లాసు పీకారని సమాచారం. గురువారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో (Narendra Modi)మోదీ ఎంపీలు, ఎంఎల్ఏలకు అల్పాహార విందు ఇచ్చారు. ఏపీ, (Telangana BJP)తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టిఫెన్ పెట్టి మరీ మోదీ ప్రజాప్రతినిధులకు తలంటారు. విందుతర్వాత ప్రధానమంత్రి విడివిడిగా ప్రజాప్రతినిధులతో సమావేశమైనపుడు తెలంగాణ ఎంపీలు, ఎంఎల్ఏలకు ఫుల్లుగా క్లాసు పీకినట్లు తెలిసింది. మోదీ మాట్లాడుతు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు అవకాశమున్నా కనీసం ప్రతిపక్ష పాత్రకూడా పోషించటంలేదని మండిపోయినట్లు సమాచారం.
మంచి టీమును పెట్టుకుని కూడా పార్టీ సమర్ధవంతంగా ఎందుకు అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవటానికి ఇబ్బందులు పడుతోందని నిలదీశారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగటానికి మంచి అవకాశంఉన్నా ఉపయోగించుకోవటంలో విఫలమైతుతున్నారని మండిపడ్డారు. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు యాక్టివ్ గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజలదృష్టికి తీసుకెళ్ళాలని గట్టిగా చెప్పారు.
తాజాగా మోదీ మాటలు విన్న తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్ధానంలోకి బీజేపీ చేరుకోవాలని అన్నట్లుగా అర్ధమవుతోంది. అయితే పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య చాలా వివాదాలున్న విషయం మోదీకి తెలీదా ? మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్-కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కు పడటంలేదనే ప్రచారం తెలిసిందే. అలాగే ఈటలతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కూడా పడటంలేదు. ధర్మపురితో బండికి మంచి సంబంధాలు లేవు. ఈటలంటే కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి పడదని పార్టీలోనే టాక్ వినబడుతోంది. ఎంపీల్లో చాలామంది పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావును లెక్కేచేయటంలేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.
ఇలాంటి వివాదాలే ఎంఎల్ఏలకు, అధ్యక్షుడికి మధ్య కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కిషన్ రెడ్డి, రామచంద్రరావుతో పడనికారణంగానే గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశాడు. అయితే ఈరోజు సమావేశంలో రాజాసింగ్ కూడా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ రాజాసింగ్ బీజేపీలోనే ఉన్నాడా లేడా అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. పార్టీకి రాజీనామా చేసిందే నిజమైతే ఇపుడు ఎంఎల్ఏకి పార్టీతో ఎలాంటి సంబంధంలేదు. అదే నిజమైతే ఈరోజు మోదీతో సమావేశంలో రాజాసింగ్ ఎలాగ పాల్గొన్నాడో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావే చెప్పాలి ?
పార్టీలోని ప్రజా ప్రతినిధుల మధ్యే సమన్వయం లేనపుడు, వివాదాలు తీవ్రస్ధాయిలో ఉన్నపుడు ఇక పార్టీని వాళ్ళేమి పట్టించుకుంటారు ? అయినా ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు మోదీకి తెలీకుండానే ఉంటాయా ? ఏదేమైనా బీఆర్ఎస్ స్ధానంలో బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని పార్టీ ఎంపీలు, ఎంఎల్ఏలకు మోదీ క్లాసు తీసుకోవటం కొత్త పరిణామమనే చెప్పాలి. ఇకనైనా విభేదాలు, వివాదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తారేమో చూడాలి.