పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ
95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా గెలిచిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాగా ఈ ఎన్నికలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దిశగా పయణిస్తుందన్నారు. తొలి విడత ఎన్నికల్లోనే కాంగ్రెస్ బలం స్పష్టంగా కనిపిస్తోందని, ఇది తమ ప్రభుత్వం, పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి అద్దం పడుతోందని అన్నారు. కాగా మరోవైపు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి 95 ఏళ్ల వయసులో సర్పంచ్‌గా విజయం సాధించారు. మరో చోట విజేతను టాస్ వేసి ప్రకటించారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొదటిదశలో 3834 సర్పంచ్ పదవులతో పాటు 27,678 వార్డుసభ్యులకు బ్యాలెట్ పద్దతిలో ఎన్నిక జరుగింది. మొత్తంగా 56,19,430 మంది ఓటర్లు ( 27,41,070 పురుషులు, 28,78,159 స్త్రీలు 201 ఇతరుు) ఓటర్లు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ 1433 స్థానాల్లో, బీఆర్ఎస్ 826 స్థానాల్లో, బీజేపీ 142 స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల్లో మొత్తం 395 మంది ఏకగ్రీవాలుగా నిలిచారు. వారిలో కాంగ్రెస్ మద్దతు దారులు 303 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 47 మంది, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు 39 మంది ఏకగ్రీవంగా నిలిచారు. దీంతో మొత్తంగా కాంగ్రెస్ 1736 స్థానాల్లో, బీఆర్ఎస్ 873 స్థానాల్లో, బీజేపీ 148 స్థానాల్లో, ఇతరులు 393 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
విజయానికి అవే కారణం: మహేష్ కుమార్
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విస్తృతంగా విజయం సాధించడంతో పార్టీ పక్షాన హర్షం వ్యక్తమవుతోంది. ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తొలి విడతలో 90% కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అనుబంధ అభ్యర్థుల గెలుపు, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తున్నదన్నారు.
గ్రామ స్థాయి ప్రచారం, నేతల సమన్వయం, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఈ విజయానికి ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత భారీగా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం గ్రామ పాలనలో కొత్త మార్పుకు సంకేతమని తెలిపారు. ఈ ఫలితాలు గ్రామీణ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేశ్ గౌడ్ హామీ ఇచ్చారు.
శేష జీవితం గ్రామాభివృద్ధికే: రామచంద్రారెడ్డి
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచిన 95 ఏళ్ల రామచంద్రారెడ్డి తన వయస్సును పట్టించుకోకుండా ప్రతి గ్రామం తిరిగి ప్రచారం నిర్వహించారు. ‘శేష జీవితం పూర్తిగా గ్రామాభివృద్ధికే అంకితం’ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ, తమ కుటుంబం గతంలో చేసిన సేవలను గుర్తుచేసి ఓట్లు అభ్యర్థించారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో రామచంద్రారెడ్డి స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడంతో నాగారం గ్రామంలో ఆనందం నెలకొంది.
టాస్‌తో విజయం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబాబీ గ్రామంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సర్పంచ్ ఎన్నికల్లో సమానంగా ఓట్లు పోల్ అయ్యాయి. ఇద్దరికీ కూడా 175 ఓట్లు పోల్ కావడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. నియమాల ప్రకారం, ఓట్ల సమాన పరిస్థితి రావడంతో అధికారులు టాస్ నిర్వహించారు. టాస్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్ గెలవడంతో సర్పంచ్ ఎన్నికల్లో కూడా అతడినే విజేతగా ప్రకటించారు అధికారులు.