తెలంగాణలో ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి పర్యటన
సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రధాన కార్యదర్శి సమీక్ష
శీతాకాల విడిదిలో భాగంగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రపతి ఐదురోజుల పర్యటనను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్, బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు ఫైర్ టెండర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున వైద్య బృందం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్లు భవనాల శాఖ అవసరమైన బారికేడ్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తగుచర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందం ఉండాలని ఆదేశించారు.
జీహెచ్‌ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను తగ్గించేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అలాగే తేనెటీగలను నియంత్రించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సి. వి. ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ఈ. శ్రీధర్, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సమాచార–పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రొటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.