అసలు నువ్వు భారతీయుడవేనా.. రాహుల్ కు సుప్రీం అక్షింతలు
గల్వాన్ ఘర్షణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు;
By : The Federal
Update: 2025-08-04 09:23 GMT
చైనాతో గాల్వాన్ లో జరిగిన ఘర్షణకు సంబంధించి భారత సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను నిలిపివేసినప్పటికీ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేయడానికి బదులుగా సోషల్ మీడియా పోస్ట్ లో ఎందుకు చెప్పారని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.
మీ దగ్గర నమ్మదగిన సమాచారం ఉందా?
2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని రాహుల్ గాంధీ ఎలా నిర్థారణకు వచ్చారని న్యాయమూర్తి అడిగారు. ఆయన వాదనలకు విశ్వసనీయమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.
‘‘డాక్టర్ సింఘ్వీ చెప్పండి.. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించారని మీకు ఎలా తెలిసింది? మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏదైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? మీరు ఈ ప్రకటనలు లేకుండా ఎందుకు చేస్తున్నారు. మీరు నిజమైన భారతీయులైతే మీరు ఇవన్నీ చెప్పరు’’ అని జస్టిస్ దత్తా అన్నారు.
రాహుల్ గాంధీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. 20 మంది భారతీయ సైనికులను కొట్టి చంపారని, నిజమైన భారతీయుడు ఇవి చెప్పే విషయమని ఈ వివరాలు ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
మూడు వారాలు పాటు స్టే..
సరిహద్దులో వివాదం జరిగినప్పుడు రెండు వైపులా ప్రాణనష్టం జరగడం సాధారణమేనా అని జస్టిస్ దత్తా ఎదురు ప్రశ్న వేశారు. దీనికి సింఘ్వి బదులిస్తూ రాహుల్ గాంధీ వాస్తవాలను సరిగ్గా వెల్లడించాలని, సమాచారాన్ని అణచివేయడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే ప్రశ్నలు లేవనెత్తడానికి సరైన వేదిక ఉందని జస్టిస్ దత్తా పేర్కొన్నారు.
పిటిషన్ వ్యాఖ్యలను మరింత మెరుగ్గా చెప్పి ఉండవచ్చని సింఘ్వీ అంగీకరించారు. కానీ ఫిర్యాదు ప్రతిపక్ష నాయకుడి విధి అయిన ప్రశ్నలు లేవనెత్తినందుకు పిటిషనర్ ను వేధించే ప్రయత్నం మాత్రమే అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ స్పెషల్ లీవ్ పిటిషన్ పై బెంచ్ చివరకు నోటీస్ జారీ చేసి మూడు వారాల పాటు మధ్యంతర స్టే మంజూరు చేసింది.