16 కిలోమీటర్లు, 14 వందల మంది కళాకారులు.. మోడీకి గ్రాండ్ వెల్కమ్

పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి అయోధ్య చేరుకున్న ప్రధాని మోడీకి యూపీ ప్రభుత్వం ఘనంగా స్వాగత కార్యక్రమాలతో ఆహ్వానం పలికింది.

Update: 2023-12-30 07:43 GMT
అయోధ్యలో రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ

పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి అయోధ్య చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్. అయోధ్య లో రైల్వేస్టేషన్ పాటు పలు అభివృద్ధి పనులను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటి విలువ రూ. 15 వేల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. మొత్తం మూడు అంతస్తులుగా రైల్వే స్టేషన్ నిర్మించారు. దీని ఆధునీకరణకు రూ. 240 కోట్లను ఖర్చు చేశారు. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ భారత్ రైళ్లలోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.

అలాగే ప్రధాని ప్రారంభించనున్న విమానాశ్రయం టెర్మినల్ కు మహర్షి వాల్మీకీ పేరును పెట్టారు. ఉదయం విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగీ, ఇతర కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్ షో గా రైల్వే స్టేషన్ కు చేరుకుని రైళ్లను ప్రారంభించారు. అనంతరం మళ్లీ విమానాశ్రయం చేరుకుని కొత్తగా నిర్మించిన టెర్మినల్ ను ప్రారంభించనున్నారు.

విమానాశ్రయం- రైల్వే స్టేషన్ మధ్య దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. దీనికి ‘రామ్ పథ్’ గా పేరు పెట్టారు. ఈ మార్గంలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానిపై అయోధ్య వాసులు పూలవర్షం కురిపించారు. 16 కిలోమీటర్ల పొడగునా 40 వేదికలు నిర్మించి, 1400 మంది కళాకారులు ప్రధానికి స్వాగతం పలికారు.

ప్రధాని ప్రారంభించనున్న విమానాశ్రయ టెర్మినల్ మొదటి దశ కోసం రూ. 1450 కోట్లు ఖర్చు చేశారు. టెర్మినల్ భవనం 6,500చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా పది లక్షల మంది ప్రయాణీకులకు సేవలందిచేలా దీన్ని నిర్మించారు. టెర్మినల్ లోపల శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే చిత్రకళ, పెయిటింగ్, కుడ్యచిత్రాలు( గోడలపై పెయింట్) లతో అలంకరించారు.

ప్రధాని రాకను పురస్కరించుకుని అయోధ్యలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే టెంపుల్ సిటీని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాని మోడీ చిత్రాలతో భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు. పూలు, కుడ్యచిత్రాలు, వివిధ అలంకార స్తంభాలు ఏర్పాటు చేశారు. శనివారం అయోధ్యలో ప్రధాని దాదాపు మూడు గంటలు గడిపారు. ప్రధాని రాకకు ముందే రోజే ఇక్కడి ఆలయాల్లో రాముడికి అంకితం చేసిన భక్తి గీతాలు, పవిత్ర మంత్రోచ్ఛరణలు నగరం మొత్తం వినిపించాయి.

Tags:    

Similar News