అయోధ్య రామా, మేమిక కదిలి వచ్చేమా!

శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా... అంటూ భక్తులు అయోధ్యకు క్యూ కట్టారు. అభినవ రామా.. నిను చూడగ ఈ నేత్ర తరమా!;

Update: 2024-01-06 05:13 GMT
అయోధ్య రామాలయం విశిష్టతలు

సూర్య కిరణాలు భూమిని తాకీతాకడానికి మునుపే అక్కడ క్రేన్లు, ట్రక్కులు, కోత మిషన్లు రోద పెడుతున్నాయి. శిల్పుల చేతిలోని సుత్తెలు, శ్రావణాలు సుతారంగా మోగుతున్నాయి. మరోపక్క నుంచి చెవులకింపైన ఆధ్యాత్మిక సంగీతం వీనుల విందు చేస్తోంది. మేస్త్రీలు పనుల పర్యవేక్షణ సాగుతోంది. ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు పనుల తీరును పరిశీలిస్తున్నారు... ఎక్కడనుకుంటున్నారా! మన అయోధ్యలోనే.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి రెండు గంటల పాటు ప్రయాణిస్తే అయోధ్య వస్తుంది. ఒకప్పుడు చుట్టూ ఆరడుగల పందిర్లో ఉండే రామలల్లా ఇప్పుడు ఎటుచూసినా చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర విస్తరించబోతోంది. 360 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పున నిర్మిస్తున్న రామాలయాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. భారతీయుల ఆరాధ్యదైవంగా భావించే అయోధ్య రామాలయం విశిష్టతలు ఎన్నో, మరెన్నో...

అయోధ్య రామా, నిను చూడతరమా!


అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ముస్తాబవుతోంది. 500 ఏళ్ల నుంచి ఉన్న అయోధ్య ఆలయ ఆకాంక్షకు తుది రూపు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలు, 70 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో నిర్మించారీ ఆలయాన్ని. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆ నరోత్తముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భగుడిలో పాలరాతితో చేసి బంగారు పూత పూసిన 8 అడుగుల సింహాసనంపై కొలువుదీరనున్నాడు ఆ జగదభి రాముడు. రఘుకుల రాముడి ఆలయ నిర్మాణానికి దేశ నలుమూలల నుంచి ఆరితేరిన కళాకారులు తరలివచ్చారు.

మొత్తం 70 ఎకరాల్లో ఆలయం...


రామాలయ ప్రాంగణం మొత్తం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో మూడు అంతస్థుల్లో ఉంటుంది. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం పరిధి మొత్తం 70 ఎకరాలు. ఆలయ ప్రధాన శిఖరం కింద గర్భగుడిని నిర్మించారు. అయోధ్య ఆలయం దీర్ఘ చతురస్రాకారంలో, గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మించారు. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా దక్షిణ భారత దేశంలో దర్శనమిస్తాయి. ఆలయంలోని నాలుగు మూలలను నలుగురు దేవతలకు అంకితమిస్తారు. ఇవి సూర్యుడు, మా భగవతి, వినాయకుడు, శివుడి అంశలుగా ఉంటాయి. ఉత్తరం దిక్కున అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు హనుమంతుడి మందిరం ఉంటుంది.

ప్రధాన శిఖరంతో పాటు 5 గోపురాలు...

ప్రధాన శిఖరంతో పాటు 5 గోపురాలను నిర్మించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మంటపాలకు నృత్యం, రంగు, సమావేశం, ప్రార్థన, కీర్తన అనే పేర్లు పెట్టారు. తూర్పు దిశ నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే.. తొలుత బాలుడి రూపంలో ఉన్న రాముడు, ఆ తర్వత రామ్‌ దర్బార్‌ ఉంటుంది. మొదటి వేదిక నుంచి కూడా గర్భగుడిలోని స్వామివారు కనిపించేలా నిర్మాణం చేపట్టారు. రామయ్య దర్శనం తర్వాత దక్షిణం వైపు నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

హైదరాబాద్ తలుపులు, మహారాష్ట్ర టేకు..


ఆలయ ప్రాంగణాన్ని మొత్తం 392 స్తంభాలతో నిర్మించారు. ప్రధాన ఆలయంలో 44 ద్వారాలుండగా.. 18 తలుపుల్లో తయారు చేసిన అచ్చుల్లో 3 కిలోల చొప్పున బంగారాన్ని వినియోగించారు. హైదరాబాద్‌కు చెందిన కళాకారులు.. మహారాష్ట్రకు చెందిన టేకుతో మొత్తం 118 తలుపులు తయారు చేస్తున్నారు. ప్రతి ద్వారంపైనా ఏనుగులు, తామర పువ్వుల బొమ్మల్ని మలిచారు.

ఆలయ నిర్మాణంలో 22 లక్షలకు పైగా క్యూబిక్‌ ఫీట్ల రాళ్లను ఉపయోగించారు. 17 వేల గ్రానైట్‌ బ్లాక్స్‌, 5 లక్షల క్యూబిక్‌ ఫీట్ల పింక్‌ స్టోన్‌ను వినియోగించారు. ఒక్కో అంతస్థు 20 అడుగుల ఎత్తుతో.. మూడు ఫ్లోర్లలో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ అవసరాల కోసం ప్రత్యేక వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు, ఆలయంలోనే హెల్త్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు భక్తులు త్వరగా బయటకు వెళ్లేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కూడా ఉంది.

చెక్కు చెదరని నిర్మాణం...

ఎలాంటి విపత్తులు వచ్చినా చెక్కుచెదరకుండా ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2 వేల ఏళ్లకుపైగా తట్టుకునేలా డిజైన్‌ చేశారు. 12 మీటర్ల లోతు నుంచి పునాదులు వేయడం వల్ల 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా ఈ ఆలయం తట్టుకుంటుంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే మరో 7 ఆలయాల నిర్మాణం కూడా ప్రారంభించారు. ఇందులో మహర్షులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యతో పాటు నిషాద్ రాజ్, శబ్రీ, అహల్య, జటాయువు ఆలయాలు ఉంటాయి.

ప్రతి రోజూ 1.5 లక్షల మంది వస్తారా!

“నా చిన్నతనంలో అయోధ్యకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రతినిత్యం 20 వేల మందికి తక్కువ కాకుండా వస్తున్నారు. 2020 తర్వాత అదింకా పెరిగింది. 2023 తర్వాత నా అంచనా ప్రకారం ప్రతి నిత్యం లక్షన్నర మంది రావొచ్చు” అన్నారు యూపీ ఉద్యోగ వ్యాపార ప్రతినిధి మండల్ అధ్యక్షుడు పంకజ్ గుప్తా. అందువల్లనే వచ్చిపోయే యాత్రికులకు, బస చేయాలనుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆలయ ప్రాంతంలో ఒకేసారి 25 వేల మంది బస చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

చుట్టుపక్కల ప్రాంతాలకు పెరిగిన గిరాకీ..


అయోధ్య రామమందిరం రాకతో నగర శివారు ప్రాంతాలకు గిరాకీ పెరిగింది. సుమారు 250 ప్రాజెక్టులు కొత్తవి రాబోతున్నాయి. 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. 12వందల కోట్ల రూపాయలతో కొత్త టౌన్ షిపులు, సరికొత్త విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్ రానున్నాయి. ఇవన్నీ వస్తే అయోధ్య మరో ఢిల్లీ అవుతుందంటున్నారు స్థానికులు.

Tags:    

Similar News