దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్’ అమలు: ఎన్నికల సంఘం

రాష్ట్రాలలో చివరి కట్ ఆఫ్ తేదీల ఓటర్ల సవరణ జాబితాను వెలికి తీస్తున్న రాష్ట్రాలు;

Update: 2025-09-10 13:06 GMT

బీహార్ లో జరుగుతున్న ‘ఎస్ఐఆర్’(సార్) కార్యక్రమం తరువాత దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియను అమలు చేయడానికి ఎన్నికల సంఘం నడుం బిగించింది. 2026 లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం అఖిల భారత స్థాయిలో ‘ఎస్ఐఆర్’ పై ఎన్నికల సంఘం కసరత్తు నిర్వహించింది.

దేశ వ్యాప్తంగా ‘ఎస్ఐఆర్’ అమలుకు సన్నాహాలు చర్చించడానికి ఈసీ, దాని రాష్ట్ర అధికారులుతో కీలకమైన సమావేశం నిర్వహించింది. సీనియర్ ఈసీ అధికారులు ‘ఎస్ఐఆర్’ విధానంపై ప్రజెంటేషన్ ఇస్తారని భావిస్తున్నారు.

బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి ‘ఎస్ఐఆర్’ అమలులో రాష్ట్ర అనుభవాలను పంచుకుంటారు. ఫిబ్రవరిలో జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇది మూడో సీఈఓల సమావేశం.

అయితే దేశవ్యాప్త ‘ఎస్ఐఆర్’ సంసిద్దతపై చర్చలు జరుగుతున్నందున బుధవారం జరిగిన సమావేశం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందని అధికారులు తెలిపారు.

బీహార్ తరువాత దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం గతంలోనే తెలిపింది. 2026 లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్రమ వలసదారులే లక్ష్యంగా ‘ఎస్ఐఆర్’..
ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించి, వారిని మన దేశ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా కాకుండా చూడటమే సార్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం భారత్ లోకి మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా విదేశీయులు ప్రవేశిస్తున్నారు.
చాలా ప్రాంతాలలో జనాభా స్వరూపాలు మారిపోతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. దీనితో ఎన్నికల సంఘం చేపట్టే ప్రక్రియపై దేశమంతా ప్రాధాన్యం సంతరించుకుంది.
చివరికి ఎన్నికల అధికారి ఎన్నికల జాబితాల సమగ్రతను కాపాడటానికి తన రాజ్యాంగ ఆదేశాన్ని అమలు చేయడానికి దేశ వ్యాప్తంగా సర్ ను ప్రారంభిస్తారు. ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి పోల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు.
అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కు అయిందని, మోదీని గెలిపించడానికే ఈ ప్రక్రియ ప్రారంభించారని ఆందోళనలు నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల సంఘం వీటిని తోసిపారేస్తోంది. అక్రమ వలసదారులు ఓటర్ల జాబితాలో నమోదు కాకుండా ఏరివేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించింది.
జననం.. జన్మ స్థలానికి సంబంధించిన పత్రాలు..
ఓటర్లుగా మారాలంటే లేదా రాష్ట్రం నుంచి వలస వెళ్లిన వారి కోసం దరఖాస్తులో అదనపు డిక్లరేషన్ ఫామ్ ప్రవేశపెట్టారు. వీరు జూలై 1, 1987 కి ముందు భారత్ లో జన్మించిన వారై ఉండాలి.
దీనికోసం పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాన్ని సూచించే ఏదైనా పత్రాన్ని నిర్థారించుకోవాలి. డిక్లరేషన్ ఫారమ్ లో జాబితా చేయబడిన అంశాలలో ఒకటి వారు జూలై1, 1987 కి ముందు, డిసెంబర్ 2, 2004 మధ్య భారత్ లో జన్మించిన వారై ఉండాలి.
వారి తల్లిదండ్రుల పుట్టిన తేదీ, స్థలం పత్రాలు కూడా సమర్పించాలి. కానీ బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష పార్టీలు దాడి చేస్తున్నాయి. పత్రాలు లేకపోవడం వలన లక్షలాది మంది అర్హులైన పౌరులు ఓటు హక్కు కోల్పోతున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అర్హులైన ఎవరూ కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు కొందరూ తమ రాష్ట్రాలలో జరిగిన చివరి ఎస్ఐఆర్ తరువాత ప్రచురించిన ఓటర్ల జాబితాను వెలికి తీయడం ప్రారంభించారు.
ఢిల్లీ సీఈఓ వెబ్ సైట్ లో దేశరాజధానిలో చివరి ఇంటెన్సివ్ సవరణ జరిగిన 2008 ఓటర్ల జాబితా ఉంది. ఉత్తరాఖండ్ లో చివరిగా 2006 లో ఎస్ఐఆర్ జరిగింది. ఆ సంవత్సరం ఓటర్ల జాబితా ఇప్పుడు సీఈఓ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
2003 బీహార్ ఓటర్ల జాబితాను ఈసీ ఇంటెన్సివ్ సవరణ కోసం ఉపయోగిస్తున్నందున రాష్ట్రాలలో చివరి ఎస్ఐఆర్ కటాఫ్ తేదీలుగా పనిచేస్తుంది. చాలా రాష్ట్రాలు 2002, 2004 మధ్య ఓటర్ల సవరణ జాబితాను నిర్వహించాయి.


Tags:    

Similar News