పాత దోస్తుతో పాత ఫలితమేనా? బిహార్ లో పార్టీల లెక్కలేమిటి?

ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీష్ పాత మిత్రుడు బీజేపీతో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ 2019 నాటి ఫలితాలు పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Update: 2024-01-29 10:37 GMT
ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్

బిహార్ లో రెండు రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఊహించినట్లే సాగుతున్నాయి. సీఎం నితీశ్ కుమార్ మహఘట్ బంధన్ తో తాను ఏర్పాటు చేసుకున్న పొత్తును తెగ్గొట్టి.. తిరిగి పాత జిగిరి దోస్తు బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.

దీనిపై రాజకీయపార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఆయన పట్టించుకోలేదు. మరోవైపు బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి 2019 నాటి ఫలితాలను పునరావృతం చేయాలని ఆరాటపడుతోంది. నితీశ్ రాకతో బిహార్ లో 40 శాతం ఉన్న వెనకబడిన కులాలలోని, అత్యంత వెనకబడిన కులాల మద్దతు పొందవచ్చని లెక్కలు వేస్తోంది.

మండల్- కమండల్ మ్యాజిక్ తో యాదవేతర కులాల మద్దతు తమకే లాభిస్తుందని కమలదళం అంచనావేస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష ఆర్జేడీకి దన్నుగా ఉన్న యాదవులను సైతం డైలామాలో పడేయడానికి తగిన ప్రణాళికలను బీజేపీ రూపొందించింది.

గత మూడు దశాబ్దాలుగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాజకీయాలలో ఉందని, 15 ఏళ్లు అధికారం అనుభవించిందని కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రం యాదవుల వాటా కేవలం 1.4 శాతంగా మాత్రమే ఎందుకుందని నవంబర్ 14న జరిగిన గోవర్ధన పూజ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నిత్యానందరాయ్ ప్రశ్నించారు. ఇవేకాకుండా కుష్వాహ కులం మద్దతును పొందడానికి, 36 శాతంగా ఉన్న ఈబీసీలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందెందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది.

విజేతలే..

బిహార్ లో జేడీయూ- బీజేపీ పొత్తు చాలా సార్లు విజయతీరాలకు చేరుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మినహయిస్తే, 2014, 2019 లోక్ సభ ఎన్నికలు, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించాయి. ముఖ్యంగా గడిచిన లోక్ సభ ఎన్నికల్లో 40 ఎంపీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 39 స్థానాలు గెలుచుకుంది.

కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు గెలుచుకుంది. ఆర్జేడీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. ఎన్డీఏ గెలుచుకున్న స్థానాల్లో 17 బీజేపీ, 16 జేడీయూ, 6 స్థానాలను ఎల్జేపీ కి దక్కాయి. "ఈ సారి కూడా ఇవే ఫలితాలు వస్తాయి" అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ప్రేమ్ రంజన్ పటేల్ పేర్కొన్నారు.

కులం కార్డు కీలకం

నితీశ్ కుమార్ ఇంతకుముందు కులాల సర్వే ద్వారా రిజర్వేషన్ కోటా 50 శాతం నుంచి 65 శాతానికి పెంచారు. ఈ రిజర్వేషన్ కార్డుతో బీజేపీ సైతం కచ్చితంగా హిందూత్వ అంశంతో పాటు కులంకార్డును ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. వివిధ కులాల్లోని ప్రముఖ నాయకులను గుర్తించి వారిని తమ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని అడుగులు చూస్తే తెలుస్తోంది.

కులాల సర్వే ప్రకారం మొత్తం జనాభాలో వెనకబడిన కులాలు 63 శాతంగా ఉన్నాయి. ఇందులో అత్యంత వెనకబడిన కులాలు 36 శాతం కాగా, ఇతర వెనకబడిన కులాలు 27 శాతంగా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు 19.65, షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతం, అగ్రవర్ణాల వారు 15.52 శాతంగా లెక్కతేలింది. అయితే దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సర్వేలో యాదవులు, ముస్లింల జనాభాను పెంచి చూపారని ఆరోపించారు. అయితే అసెంబ్లీలో మాత్రం బీజేపీ ఈనివేదిక ఆమోదానికి మద్దతునిచ్చింది.

అన్ని ఎన్నికల్లో బీజేపీకి ప్రధానబలంగా ఉంటున్న అగ్రవర్ణాల వారికీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఇతర కులాల వారీ సంఖ్య పెరిగితే వారికి తగ్గట్లుగా రిజర్వేషన్లు సర్ధుబాటు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన రిజర్వేషన్ ను తగ్గించాల్సి ఉంటుంది. దీనివల్ల వారి మద్దతు కొల్పోవాల్సి ఉంటుందని కమలం పార్టీ భయపడుతోంది.

లవ్- కుష్ లను విడగొట్టి బలపడడం

నితీశ్ కుమార్ ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి నిర్మించుకున్న ప్రసిద్ద ‘లవ్ - కుష్’ కలయికలో కుష్వాహా కూటమిని ఏర్పాటు చేయడం బీజేపీ లక్ష్యం. ‘లవ్’ కలయికలో నితీశ్ కుమార్ కుర్మీ కులానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కుష్ పదం కుష్వాహా కులానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు కుష్ కులానికి బీజేపీ నుంచి ఒక నాయకుడిని ప్రతినిధిగా చేయాలని కమల దళం వాంఛ.

ఇందుకోసం మొదట బీజేపీ రాకేష్ కుమార్ అలియాస్ సామ్రాట్ చౌధరినీ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నియమించింది. ఇప్పుడు అతను ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలోని ప్రవేశించాడు. ఇతడు కుష్వాహా కులానికి చెందిన వాడు. ఈయన మొదట 1999లో ఆర్జేడీ హయాంలో మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో జేడీయూలో చేరి ఎమ్మెల్సీగా తరువాత మంత్రి అయ్యారు. 2018లో బీజేపీలో చేరారు.

మొత్తం జనాభాలో 4.21 శాతం ఉన్న కుష్వాహాలు ఈ సారీ తమ నాయకుడు సీఎం కావాలని కోరుకుంటున్నారు. యాదవులు, కుర్మీలు ఇక అధికారం చలాయించింది చాలు అని వారి అభిప్రాయం. తమకు లాలూ, నితీశ్ హయాంలో తగినంత ప్రాధాన్యం లభించలేదన్నది వారి వాదన. ప్రస్తుతం సామ్రాట్ చేరికతో తమకు కుష్వాహా మద్దతు పూర్తిగా లభిస్తుందని బీజేపీ ఆశాభావంతో ఉంది.

అలాగే బీజేపీ ఇతర వర్గాలపై కూడా దృష్టి సారించింది. జనాభాలో ఆరు శాతంగా ఉన్న మత్యకారులు( మల్లాహ్) వంటి కమ్యూనిటీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేసింది. ఇందులో భాగంగా వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) నాయకుడు ముఖేష్ సహనీ, అలాగే ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తో సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. అయితే వీరంతా తమ పార్టీ అంతర్గత ఆధిపత్య పోరులో బిజీగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో సామాజిక న్యాయం ఏ పార్టీ వైపు ఉందో 2024 ఎన్నికల్లో ఓటర్లు తేల్చనున్నారు. 

Tags:    

Similar News