రక్త మార్పిడితో ఐదుగురు పిల్లలకు హెచ్ఐవీ

జార్ఖండ్ లో వెలుగుచూసిన దారుణం, వైద్యులను సస్పెండ్ చేసిన హేమంత్ సోరెన్

Update: 2025-10-27 07:06 GMT

జార్ఖండ్ లో వైద్యుల నిర్లక్ష్యంతో కొంతమంది పిల్లలకు ప్రమాదకరమైన హెచ్ఐవీ సోకింది. తలసేమియాతో బాధపడుతున్న ఐదుగురు పిల్లలకు రక్త మార్పిడి తరువాత హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఈ సంఘటనలో జార్ఖండ్ ప్రభుత్వం అలెర్ట్ అయి పశ్చిమ సింగ్భూమ్ సివిల్ సర్జన్, ఇతర అధికారులను సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

ఈ సంఘటనపై ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. ఈ సంఘటన ను సిగ్గుచేటుగా, పిల్లల హత్యను చేయడానికి ప్రభుత్వం స్పాన్సర్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉన్నత స్థాయి దర్యాప్తు..
పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా ప్రధాన కార్యాలయం చైబాసాలోని స్థానిక బ్లడ్ బ్యాంక్ తమ బిడ్డకు హెచ్ ఐవీ కలుషితమైన రక్తాన్ని ఎక్కించిందని ఏడేళ్ల తలసేమియా రోగి కుటుంబం ఆరోపించింది.
తరువాత ప్రభుత్వం వెంటనే వైద్యులను సస్పెండ్ చేసింది. శనివారం రాంచీలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం జరిపిన విచారణలో, మరో నలుగురు పిల్లలకు హెచ్ ఐవీ పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది.
‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. సంబంధిత సివిల్ సర్జన్, బ్లడ్ బ్యాంకు ఇన్ చార్జీ మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్లను తక్షణమే సస్పెండ్ చేశాం. ఏసీఎంఓకి బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది’’ అని జార్ఖండ్ అదనపు ప్రధాన కార్యదర్శి అజోయ్ కుమార్ సింగ్ జాతీయ మీడియాకు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రక్తదానం చేసిన సమయంలో రక్తదాతలకు హెచ్ ఐవీ నెగటివ్ వచ్చినట్లు తేలిందని, అయితే విండో పీరియడ్ టైంలో ఇది వచ్చినట్లు తోసిపుచ్చలేమని సింగ్ తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం, రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాధిత పిల్లలు, కుటుంబాలకు కౌన్సెలింగ్,యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందిస్తామని ఆయన చెప్పారు.
అంతకుముందు పశ్చిమ సింగ్ భూమ్ సివిల్ సర్జన్ తో పాటు ఇతర అధికారులను సస్పెండ్ చేయాలని సోరెన్ అధికారులను ఆదేశించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. హెచ్ఐవీ సోకిన పిల్లలకు చికిత్స ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది’’ అని సోరెన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
బ్లడ్ బ్యాంకుల ఆడిట్..
పిల్లలకు హెచ్ఐవీ సోకడంపై సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులను ఆడిట్ నిర్వహించాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంకులను ఆరోగ్యశాఖ ఆడిట్ చేసి ఐదు రోజుల్లోగా నివేదిక సమర్పించాలి.
ఆరోగ్య ప్రక్రియలో లోపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము’’ అని ముఖ్యమంత్రి మరొక పోస్ట్ లో పేర్కొన్నారు. ఆ చిన్నారి కుటుంబం చేసిన ప్రాథమిక ఆరోపణ తరవాత వారికి ఆ కలుషిత రక్తాన్ని ఎలా ఎక్కించారో దర్యాప్తు చేయడానికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. చైబాసా బ్లడ్ బ్యాంక్ లో చికిత్స ప్రారంభమైనప్పటి నుంచి ఆ చిన్నారికి దాదాపు 25 యూనిట్ల రక్తం ఎక్కించబడిందని అధికారులు తెలిపారు.
జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుశాంతో మాఝీ ముందుగా ఆ చిన్నారికి వారం రోజుల క్రితం హెచ్ ఐవీ పాజిటివ్ వచ్చిందని ధృవీకరించారు. కలుషితమైన సూదులకు గురికావడం వంటి వివిధ మార్గాల ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి చెందవచ్చని కూడా ఆయన అన్నారు.
హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం, సదర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులను, పిల్లల ఐసీయూ తనిఖీ చేసి ప్రస్తుతం చికిత్స పొందుతున్న పిల్లల నుంచి వివరాలను సేకరించింది.
పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలో ప్రస్తుతం 515 హెచ్ఐవీ పాజిటివ్ కేసులు, 56 తలసేమియా రోగులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ బృందంలో ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేశ్ కుమార్, డాక్టర్ శిప్రాదాస్, డాక్టర్ ఎస్ఎస్ పాశ్వాన్, డాక్టర్ భగత్, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ మాఝీ, డాక్టర్ శివచరణ్ హాన్నా, డాక్టర్ మినుకుమారి ఉన్నారు.
ఆందోళన కలిగిస్తోంది
కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రి అన్నపూర్ణా దేవి మాట్లాడుతూ.. ఇది అత్యంత సిగ్గుచేటు, నిర్లక్ష్యం, తీవ్రమైన కేసు అని అభివర్ణించారు. పిల్లలకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడం ఆందోలన కలిగించే విషయమని, ఇది జార్ఖండ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తుందని ఆమె అన్నారు.
దీనికి పరిహారం మాత్రమే సరిపోదని మంత్రి అన్నారు. దీనిపై బాధ్యులను గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చారు. నిర్ణీత కాలపరిమితిలోగా ఉన్నత స్థాయి విచారణ నిర్వహించాలని దోషులుగా తేలిన ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీ విమర్శలు..
పిల్లల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మరాండీ మాట్లాడారు. ఇది నిర్లక్ష్యం కాదని, రాష్ట్ర ప్రాయోజిత పిల్లల హత్యా ప్రయత్నం అని అభివర్ణించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు అమాయక పిల్లలకు కలుషిత రక్తం ఇచ్చారని ఈ విషాదం జార్ఖండ్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పతనాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన ఆరోపించారు.
కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం సరిపోదని, ఆరోగ్యమంత్రి ఇర్పాన్ అన్సారీని తొలగించాలని మరాండీ డిమాండ్ చేశారు. ఆయన ఈ నిష్క్రియాత్మకంగా, అసమర్దుడిగా అభివర్ణించారు.


Tags:    

Similar News