కేజ్రీవాల్ అరెస్ట్ చట్టవిరుద్దం కాదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు సంస్థ చట్ట ప్రకారమే అరెస్ట్ చేసినట్లు పేర్కొంది.
By : The Federal
Update: 2024-04-09 12:15 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మీ అరెస్ట్ చట్టవిరుద్దంగా జరగలేదని పేర్కొంది.
"అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చట్టపరమైన నిబంధనలకు లోబడే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. రిమాండ్ చట్టవిరుద్ధంగా పరిగణించబడదు" అని తీర్పును వెలువరిస్తూ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ అన్నారు. ఇంకా, జస్టిస్ శర్మ మాట్లాడుతూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద "తగినన్ని ఆధారాలు" ఉన్నాయి, ఇదే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి దారితీసింది, ట్రయల్ కోర్టు అతనిని హేతుబద్ధమైన ఉత్తర్వు ద్వారా ఏజెన్సీ కస్టడీకి అప్పగించిందని అన్నారు.
తన తదుపరి రిమాండ్ ను కూడా ఆయన సవాల్ చేశారు. ఇది కూడా చట్టబద్దమే అని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగట్లేదని, కానీ అతను దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై మాత్రం సంబంధిత పరిధిలో విచారణ జరుగుతుందని చెప్పారు.
జస్టిస్ శర్మ 25 నిమిషాల పాటు తీర్పును చదివి, తన నిర్ణయంలోని కొన్ని భాగాలను హిందీలో కూడా వివరించారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని, న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతతో సంబంధం కలిగి ఉన్నాయని, రాజకీయ నైతికత కలిగి ఉండవని అన్నారు.
కోర్టులో ఆప్ వాదనలు పలు కోణాల్లో జరిగాయి. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్లు కోర్టు ముందుంచింది. అయితే వీటిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు లీగల్ అంశాలను మాత్రమే పరిగణిస్తుంది. ఇది కేంద్రానికి, కేజ్రీవాల్ కు సంబంధించింది కాదు. ఢిల్లీ సీఎం కు, ఈడీకి సంబంధించింది. దీనిని కోర్టు గమనించింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. విచారణలో అన్ని స్టేట్ మెంట్లు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టు వివరించింది.
కేజ్రీవాల్ అరెస్ట్
2021-22 లో ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించింది. అయితే ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో భాగంగా ఇంతకుముందు బీఆర్ఎస్ నేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయింది. అనంతరం కేజ్రీవాల్ తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు రక్షణ ఇవ్వలేమని కోర్టు వెల్లడించింది. దీంతో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ జరిగిందన దర్యాప్తు సంస్థ ఆరోపిస్తూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచారు, ఈ కేసులో కేజ్రీవాల్ ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.