ఢిల్లీ అసెంబ్లీ: ప్రతిపక్ష నాయకురాలిగా అతిశీ
ఆప్ అగ్రనాయకత్వం ఓటమి పాలవడంతో మాజీ సీఎంకే ఎల్ఓపీ;
By : The Federal
Update: 2025-02-23 11:25 GMT
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి అతిశీని ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడిన తరువాత తొలిసారిగా ఓ మహిళా నేతకు ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో అతిశీని ఎన్నుకున్నామని పార్టీ ప్రకటించింది.
ఈ సమావేశానికి పార్టీ అధినేత కేజ్రీవాల్, కల్కాజీ శాసనసభ్యురాలు అతిశీ తో సహ పార్టీ 22 మంది ఎమ్మెల్యేలు హజరయ్యారు.
అతిశీకి పట్టం..
ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన నాయకులలో ఒకరైన అతీశీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సరైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సౌరభ భరద్వాజ్ వంటి ఇతర అగ్రనాయకులు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో ఆప్ నాయకురాలికి ఎల్ఓపీ పదవి దక్కింది.
‘‘నన్ను విశ్వసించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, శాసనసభా పార్టీకి ధన్యవాదాలు. బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతును పెంచుతుంది. బీజేపీ ఇచ్చిన వాగ్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసేలా ఒత్తిడి చేస్తుంది’’ అని అతిశీ అన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో అగ్ర శ్రేణి నాయకులు జైలులో ఉండటంతో దేశ రాజధాని రాజకీయాలపై ఆమె పట్టుబిగించడం ప్రారంభించింది. అనేక అంశాలపై ఆమె కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
సెప్టెంబర్ 2024 లో కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తరువాత రాజీనామా చేసిన తరువాత తన విధేయతకు సీఎం పీఠం బహుమతిగా దక్కింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన మాజీ బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ 1000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
బయటకు రానున్న కాగ్ నివేదిక
ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశం ఫిబ్రవరి 24న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో గత ప్రభుత్వ పనితీరుపై పెండింగ్ లో ఉన్న కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెడతామని అధికార బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం అయింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం ఓటమి పాలైంది.