అయోధ్య జన సంద్రం.. భక్తి పారవశ్యం..జగమంతా రామోత్సవం
భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగనుంది. ఇప్పటికే అయోధ్య భక్తజన కోటితో కిటకిటలాడుతోంది. ఎటుచూసినా రామనామమే, రామోత్సవమే..
జగమంతా సంబరంలా.. భారత్ యావత్ భక్తి పారవశ్యంలో ఓలలాడుతోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట నేషనల్ ఈవెంట్ గా మారింది. అయోధ్య కిటకిటలాడుతోంది. ఎటుచూసినా రామనామం హోరెత్తుతోంది. భక్తులు లయబద్ధంగా రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఎన్నో శతాబ్దాల హిందువుల కల నేడు సాకారం కాబోతోంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక సాక్షాత్కరించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. భారత్‌తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తున్నాయి.
మంగళధ్వనితో ప్రారంభం...
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మంగళ ధ్వనితో ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటల నుంచి ఇది మొదలు కానుంది. దాదాపు రెండుగంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికిపైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. న్యూఢిల్లీలోని కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో.... యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరుగనుంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి పఖావాబ్, బాన్సూర్, ధోలక్.. ఒడిశా నుంచి మర్దల్, కర్ణాటక నుంచి వీణ, మధ్యప్రదేశ్ నుంచి సంతూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం , జార్ఖండ్ నుంచి సితార్, తమిళనాడు నుంచి నాదస్వరం, తవిల్, మృందంగంలాంటి సంగీత వాయిద్యాలతో రాముడికి నీరాజనం అర్పించనున్నారు.
ఈరోజు మధ్యాహ్నం 12.20 గంటలకు...
ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 12గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజీత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. శుభ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉంటుంది. అంటే ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్‌లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేయనున్నారు. కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కిపైగా సంప్రదాయాలు, 50కిపైగా గిరిజన, తీర, ద్వీపం, తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరవుతున్నారు.
ఒంటిగంటలోపు పూర్తి...
బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తికానుంది. పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇవ్వనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశీస్సులు అందజేయనున్నారు.
4 గంటలు ఉండనున్న ప్రధాని...
ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు అయోధ్యలోనే ఉండనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు ఆయన అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10గంటల 55 నిమిషాలకు రామజన్మభూమికి చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత... ఒంటి గంటకు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు కుబేర్ తిలాను సందర్శించిన తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.
10 లక్షల దీపాలతో రామజ్యోతి...
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరుపనున్నారు. సాయంత్రం 10 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోనుంది. ఇళ్లు, దుకాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రామజ్యోతి వెలుగనున్నది. సరయూ నది ఒడ్డున దీపాలతో కాంతులీననుంది. రామ్‌లల్లా, కనక్ భవన్, హనుమాన్‌ఘర్హి, గుప్తర్‌ఘాట్, సరయూ బీచ్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా... మొత్తం వంద దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలలో రామజ్యోతి వెలిగించనున్నారు.
అయోధ్య చేరిన చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబు...
రామ మందిర ప్రారంభోత్సవానికి 8వేల మంది మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు. రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారినీ ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి, పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.