బీహార్ ఎన్నికలు: తొలి జాబితా ప్రకటించిన ఎంఐఎం
ఇండి కూటమి ద్వారా పోటీకి ప్రయత్నాలు, ఫలించకపోవడంతో ఒంటరిగా పోటీకి సన్నాహాలు
By : The Federal
Update: 2025-10-19 12:04 GMT
ఇండి కూటమి ద్వారా పోటీ చేయడానికి ప్రయత్నించి భంగపడిన ఎంఐఎం పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. కనీసం వంద సీట్లలో పోటీ చేస్తామని ప్రతిజ్ఞ చేసిన అసదుద్దీన్ 25 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు.
ఇందులో ఇద్దరు నాన్ ముస్లింలు ఉన్నారు. ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు బీహార్ లో ఆ పార్టీ గెలుచుకున్న ఏకైక ఎమ్మెల్యే అయిన అఖ్తరుల్ ఇమాన్ తొలి జాబితాను ఎక్స్ లో ప్రకటించారు.
‘‘రాబోయే బీహార్ ఎన్నికలకు ఎఐఎంఐఎం అభ్యర్థులను జాబితాను ప్రకటించడానికి మేము సంతోషంగా ఉన్నాము. పార్టీ జాతీయ నాయకత్వంలో సంప్రదించి ఎఐఎంఐఎం బీహార్ యూనిట్ అభ్యర్థును ఖరారు చేసింది.
ఇన్షా అల్లాహ్, బీహర్ లో బలహీన, నిర్లక్ష్యం చేయబడిన వారికి న్యాయం కోసం మేము గొంతుకగా ఉన్నాము’’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇమాన్ అమోర్ నుంచి ఎంఐఎం తన పార్టీ అభ్యర్థులను ఎక్కువగా సీమాంచల్ ప్రాంతం నుంచే ప్రకటించింది.
ఇక్కడ ఎక్కువగా ముస్లిం జనాభా ఉంది. ఈ ప్రాంతంలో తరుచుగా వరదలు సంభవిస్తాయి. ఇవే కాకుండా గయ, దక్షిణ మధ్య జిల్లాలోని రిజర్డ్వ్ సీట్ అయిన సికింద్రా నుంచి మనోజ్ కుమార్ దాస్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ హిందూస్థానీ అవామ్ మోర్చా పార్టీకి చెందిన ప్రపుల్ కుమార్ మాంఝీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వరుసగా రెండోసారి ఇక్కడ నుంచి గెలవాలని ప్రయత్నిస్తున్నారు.
నేపాల్ సరిహద్దులో తూర్పు చంపారన్ లోని ఢాకా నియోజకవర్గంలో, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రాణా రణధీర్ సింగ్ సోదరుడు రాణా రంజిత్ సింగ్ కు పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయన మధుబన్ నుంచి హ్యట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గత ఎన్నికలలో ఎంఐఎం 19 సీట్లలో పోటీ చేసి ఐదు గెలిచింది. కానీ పార్టీకి చెందిన నలుగురు ఆర్జేడీ లో చేరిపోయారు. ఈసారి ఎన్నికలలో ఇండి బ్లాక్ లో నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నామని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు పార్టీ వారసుడు తేజస్వీ యాదవ్ లకు లేఖలు రాసింది. అయితే దీనిపై వారు స్పందించలేదు. దీనిపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసి సొంతంగా పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు.