తగ్గుతున్న బీజేపీ ఆధిక్యం .. మళ్లీ ఆధిక్యంలోకి కేజ్రీవాల్, ఆతీశీ

ఒక్క స్థానంలోనూ ఆధిక్యంలో లేని కాంగ్రెస్;

Update: 2025-02-08 05:05 GMT

ఢిల్లీ ఎన్నిల కౌంటింగ్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 70 స్థానాలున్న అసెంబ్లీలో 36 స్థానాలు గెలుచుకున్న పార్టీకి అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 43 స్థానాల్లో, ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

మొదటి రౌండ్ లో వెనకబడిన ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీషో సిసోడియా ఆధిక్యంలో వచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కేజ్రీవాల్ పై మొదటి రౌండ్ లో పర్వేష్ వర్మ ఆధిక్యంలో కొనసాగగా, తరువాత ఆప్ అధినేత తన పట్టును నిలబెట్టుకున్నారు.
ప్రస్తుతం ఆయన 343 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. ఒక్కటంటే.. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ లీడ్ లో లేదు.
కల్కాజీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఆతీశీ, బీజేపీ నేత రమేష్ బిధూరి పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ లో మాత్రం రమేష్ బిధూరి ఆధిక్యం కనపరిచారు. ప్రస్తుతం వందల ఓట్ల సంఖ్యలోనే ఆధిపత్యం చేతులు మారుతూ ఉంది. మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా జంగ్పూరాలో 1800 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరో 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలి ఉంది.
ఆప్ కు ఎదురుగాలి..
11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఆప్ కు ఈ సారి ఎన్నికల్లో ఎదురుగాలి బలంగా వీస్తోంది. బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది. ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయింది. ప్రారంభం నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరిచింది.
70 మంది సభ్యులున్నా ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ 36. ప్రస్తుతం ఆప్ కు ఢిల్లీ అసెంబ్లీలో 62 మంది సభ్యులున్నారు. బీజేపీకి ఎనిమిది మంది, కాంగ్రెస్ కు ఒక్క స్థానం కూడా దక్కలేదు.
దేశ రాజధాని లో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఫిబ్రవరి 5న జరిగిన పోలింగ్ లో 58 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తరువాత విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీనే స్పష్టమైన మెజార్టీతో అధికారం సాధిస్తుందని అంచనా వేశాయి. కేవలం రెండు సంస్థలు మాత్రమే ఆప్ విజయం సాధిస్తుందని అంచనాలు ఇచ్చాయి.
తమకు ఎన్నికల్లో 60 సీట్ల దాకా వస్తాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2020 లో ఇలాగే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నే విజయం సాధిస్తాయని చెప్పాయని, కానీ తాము ప్రభంజనం సృష్టించామని అన్నారు.
ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆప్ పై అవినీతి వ్యతిరేక ప్రచారం ఈ సారి గట్టి ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వయంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో దాని ప్రతిష్ట మసకబారిందని, ప్రచారంలో కూడా ప్రతిపక్షాలపై చౌకబారు విమర్శలకు దిగడం ఓటర్లకు నచ్చలేదని విశ్లేషిస్తున్నారు.


Tags:    

Similar News