హిమాచల్ ప్రదేశ్: కీలక విజయాలు సాధించినా, మనుగడ సాధ్యమయ్యేనా..

హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లు కొత్త తరహ తీర్పును ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు..

Update: 2024-06-05 08:43 GMT

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంత మోదం, కొంత ఖేదం కలిగించాయి. ఇక్కడ ఉన్న నాలుగు లోక్ సభ స్థానాలను బీజేపీ ఎప్పటిలాగే తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ అసెంబ్లీలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధుబి మోగించింది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని తేలింది. తాజా ఫలితంతో 68 మంది సభ్యుల సభలో పార్టీకి సభ్యుల సంఖ్య 38కి చేరింది. ఇక్కడ మేజిక్ ఫిగర్ 35.

పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఫిబ్రవరిలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభకు అనర్హులుగా ప్రకటించడంతో ధర్మశాల, సుజన్‌పూర్, కుట్లేహర్, బర్సార్, గాగ్రెట్, లాహౌల్ - స్పితి అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ ఎమ్యెల్యేలు  - సుధీర్ శర్మ (ధర్మశాల), రాజిందర్ రాణా (సుజన్‌పూర్), ఇందర్‌దత్ లఖన్‌పాల్ (బార్సార్), దవీందర్ భుట్టో (కుట్లేహర్), చైతన్య శర్మ (గాగ్రేట్), రవి ఠాకూర్ (లాహౌల్- స్పితి) - క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ అభ్యర్థి హర్షవర్ధన్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఘోర పరాజయం పాలయ్యారు.
గెలుపు, ఓటములు
బీజేపీ, ఆ తర్వాత ఆరుగురు తిరుగుబాటుదారులను ఉప ఎన్నికలకు తమ తమ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని హమీర్‌పూర్, కాంగ్రా, సిమ్లా, మండి లోక్‌సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ గణనీయమైన ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయింది. అయితే అసెంబ్లీ సెగ్మంట్ అయినా స్పితి, సుజన్‌పూర్, గాగ్రెట్ కుట్లేహర్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది.
18 నెలల ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో ఉన్నందున, ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ పార్టీ ఉప ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు, "అధికారం కోసం ప్రత్యర్థులతో కలిసిన ద్రోహులకు గుణపాఠం చెప్పండి" అని ఓటర్లను కోరారు. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఓటర్లు పెద్దపీట వేసినప్పటికీ, అసెంబ్లీ ఓట్లలో మాత్రం సుక్కును నిరాశపరచలేదు.
ప్రభుత్వాలను పడగొట్టే సాంప్రదాయం పక్కకు..
బీజేపీ అభ్యర్థులు అనురాగ్ ఠాకూర్, రాజీవ్ భరద్వాజ్, సురేష్ కశ్యప్, కంగనా రనౌత్ తమ కాంగ్రెస్ ప్రత్యర్థులపై వరుసగా హమీర్‌పూర్, కాంగ్రా, సిమ్లా, మండి లోక్‌సభ స్థానాల నుంచి సునాయాసంగా విజయం సాధించగా, బీజేపీ పార్టీ నుంచి అసెంబ్లీ తరఫున బరిలోకి దిగిన రాజిందర్ రాణా, చైతన్య శర్మ, రవి ఠాకూర్, దేవిందర్ భుట్టో ఓడిపోయారు.
సుధీర్ శర్మ, ధర్మశాల సీటులో ఓడిపోతారని భావించారు, అయితే, తన కాంగ్రెస్ ప్రత్యర్థి దేవిందర్ సింగ్ జగ్గీపై స్వల్ప ఆధిక్యంతో విజయాన్ని సాధించారు. బర్సార్ ఉపఎన్నికలో కూడా బిజెపి విజయం సాధించింది. దాని అభ్యర్థి ఇందర్దత్ లఖన్‌పాల్ కాంగ్రెస్‌కు చెందిన సుభాష్ చంద్‌పై గెలిచి సీటును నిలబెట్టుకున్నారు.
అనురాగ్ ఠాకూర్
ఆసక్తికరంగా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నిలుపుకున్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు - కుట్లేహర్, గాగ్రెట్, సుజన్‌పూర్ - కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సొంత గడ్డ అయిన హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఠాకూర్ ఈసారి హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని 1.82 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 
అయితే తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లకు జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీని గెలుపుతీరాలకు చేర్చడంలో విఫలం అయ్యారు. ఓటర్లు లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు స్పష్టమైన తేడాను చూపుతున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలకు, దేశానికి మేలు జరుగుతుందో ఓటర్లు ఆలోచించి ఓటు వేసినట్లు తెలుస్తోంది.
రెండు ఉప ఎన్నికల విజయాలతో, రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి సంఖ్య ఇప్పుడు 27 స్థానాలకు చేరుకుంది, సాధారణ మెజారిటీకి ఇంకా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. అయితే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులను కూడా కమలం పార్టీ తన గుప్పిట్లోకి తెచ్చుకుందని గమనించడం ముఖ్యం. ఈ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలన్న నిర్ణయం ప్రస్తుతం పరిశీలనలో ఉంది.
భవిష్యత్తు
హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ ఈ స్వతంత్ర శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించారు, నిబంధనల ప్రకారం వారు ఎమ్మెల్యేలుగా పదవీకాలం ఉన్న మొదటి ఆరు నెలల్లోపు మాత్రమే పార్టీలో చేరవచ్చు. ముగ్గురు స్వతంత్రులను బిజెపి లెక్కలోకి చేర్చడం వల్ల కూడా కాషాయ పార్టీ అసెంబ్లీలో 30 సీట్లకు మించి రాదు. దీనితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఢోకా లేదు.
అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను పార్టీ కోల్పోయింది. ఇది పార్టీలో అంతర్గత కలహాలను, గ్రూపు రాజకీయాలకు తెరలేపుతుందని అర్థమవుతుంది. రెండవది, సుఖు, పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ ప్రతిభా సింగ్ మధ్య పునరావృతమయ్యే వర్గ పోరు కారణంగా లోక్‌సభ పనితీరు పేలవంగా ఉందని కాంగ్రెస్ అంతర్గతంగా అంగీకరిస్తోంది.
కాంగ్రెస్ పోరు
కాంగ్రెస్ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై హైడెసిబుల్ ప్రచారం చేసింది. హిమాచల్‌కు వరద సాయ ప్యాకేజీని మంజూరు చేయడానికి కేంద్రం నిరాకరించడం స్థానికుల్లో ఆగ్రహం రప్పించింది. ఇదే సమయంలో యాపిల్ రైతుల ఇబ్బందులు కూడా తోడవడంతో కాంగ్రెస్ బలం ఫుంజుకుంది.
కానీ కాంగ్రెస్ కు..
ఉప ఎన్నికల విజయాలు సుఖూ ప్రభుత్వాన్ని కాపాడి ఉండవచ్చు కానీ లోక్‌సభ ప్రచారానికి సంబంధించిన కొన్ని అంశాలు సుఖు ప్రభుత్వానికి కొంత ఇబ్బందిని కలిగిస్తాయని చెప్పవచ్చు. దానితో పాటు మాజీ ముఖ్యమంత్రి ప్రతిభా వర్గంలోని నాయకులకు స్థానం కల్పించకపోతే సుఖుకు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మండిలో కంగనా రనౌత్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన ప్రతిభా కుమారుడు, సుఖూ క్యాబినెట్ సహచరుడు విక్రమాదిత్య సింగ్ చాలా విషయాల్లో ఆయనకు ఎదురొచ్చే అవకాశం ఉంది.
సుక్కు తమను పక్కనబెట్టి ప్రభుత్వంలో కీలకపాత్రల కోసం తన సొంత విధేయులకే మొగ్గుచూపుతున్నాడని ప్రతిభ వర్గం తరచూ ఆరోపిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు హిమాచల్ ఓటరు, చాలా హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లోని ఓటర్లలా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలను మెచ్చుకోరని సూచించినప్పటికీ,బీజేపీ మాత్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తద్వారా ఉప ఎన్నికల విజయాలు సాధించినా రాష్ట్ర అసెంబ్లీలో స్వల్ప మెజారిటీ కోల్పోయే ముప్పు సుఖూ, కాంగ్రెస్ లను వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుతానికి, సుఖు పర్వత రాష్ట్రానికి అత్యంత తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా అవమానకరమైన వ్యత్యాసాన్ని తృటిలో తప్పించుకున్నాడనే సంతోషం మాత్రం మిగిలింది.


Tags:    

Similar News