జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్?

హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ జార్ఖండ్ కు తదుపరి సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ చంపై సోరెన్ పేరు వచ్చింది. అసలు తెరవెనక ఏం జరిగింది. ఎందుకు ఇలా..

Update: 2024-02-01 07:12 GMT
చంపై సోరెన్

హేమంత్ సోరెన్ సీఎంగా రాజీనామా చేయగా తదుపరి ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ విధేయుడు, రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ పేరును ప్రతిపాదించారు.

నిన్న హేమంత్ సోరెన్ ను ఈడీ ఏడుగంటల పాటు విచారించి తదుపరి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈడీ విచారణకు సరిగా సహకరించకపోవడం, దాటవేత సమాధానాలు ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ పేర్కొంది.

హేమంత్ సోరెన్ ను మొదట ఈడీ జనవరి 20 న విచారించింది. నిన్న జరిగిన విచారణలో దాదాపు 15 ప్రశ్నలు సంధించి, సమాధానాలు రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. విచారణకు సరిగా సహరించకపోవడంతో అరెస్ట్ చేసినట్లు సమాచారం. దాంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నాయకులు సమావేశం అయ్యారు. కూటమికి తదుపరి నాయకత్వం వహించేది చంపై సోరెన్ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ ప్రకటించారు.

కూటమి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. "మేము 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం" అని కాబోయే ముఖ్యమంత్రి, జేఎంఎం శాసనసభా పక్షం నాయకుడు చంపై సోరెన్ విలేకరులతో అన్నారు.

చంపై సోరెన్ ఎవరూ?

గత మూడు దశాబ్దాలుగా ఆయన జార్ఖండ్ లోని సెరికెలా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. శిబూ సోరెన్ కు నమ్మినబంటు. ఆయన నవంబర్ 1956 లో జార్ఖండ్ లోని సెరైకెలా- ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్ గోరా గ్రామంలో జన్మించాడు. ఆయనకు ఏడుగురు సంతానం. మెట్రిక్యూలేషన్ చదివారు.

కల్పనా సోరెన్ సీఎం కాకూడదు: తోడికోడలు

శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఎమ్మెల్యే అయినా సీతా సోరెన్, హేమంత్ సోరెన్ భార్య, కల్పనా సోరెన్ సీఎం కాకుండా బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శించారు. "తన పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు. ఆమెకు( కల్పనా) ఏం రాజకీయ అనుభవం ఉంది. పార్టీలో సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఎవరో ఒకరిని సీఎం చేయండి, ఇంట్లో సీనియర్ ను చేయాలనుకుంటే నన్ను చేయండి" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో చంపై సోరెన్ ను ముఖ్యమంత్రి పదవి వరించింది.

అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం కూడా కల్పనా సోరెన్ సీఎం కాలేరని తెలుస్తోంది. చట్ట సభల్లో ఎన్నిక కాకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది. అయితే ఆరు నెలల్లోపు సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ కాలవ్యవధి సంవత్సరం లోపు ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదనే నిబంధనలు సైతం ఉన్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ గడువు నవంబర్ తో ముగుస్తుంది. అందువల్ల కల్పనా సోరెన్ సీఎం పీఠం అధిష్టించలేకపోయారని జేఎంఎం వర్గాల వాదనగా ఉంది.

విమర్శించిన ప్రతిపక్షాలు

హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇదీ సమాఖ్య వ్యవస్థకు విఘాతం అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి విభాగాలను దేశంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు వాడుతున్నారని రాహూల్ గాంధీ ఆరోపించారు. కాగా, బీజేపీ స్పందిస్తూ.. దేశంలో మరో అవినీతి తిమింగలం దర్యాప్తు సంస్థలకు చిక్కిందని వ్యాఖ్యానించింది. 

Tags:    

Similar News