కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ ను గుర్తుకు తెస్తోంది: ప్రధాని మోదీ
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ స్వాతంత్ర సమరంలో ఉన్న కాంగ్రెస్ కాదని, దాని విధానాలు అన్నీ మారాయనీ ప్రధాని మోదీ విమర్శించారు. ఇద్దరు అబ్బాయిలు ఇంతకుముందు తీసిన సినిమా..
By : The Federal
Update: 2024-04-06 12:10 GMT
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే స్వతంత్ర్య సంగ్రామం నాటి ముస్లిం లీగ్ ను గుర్తుకు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పాత తరపు బుజ్జగింపు రాజకీయాలు తనకు పేటేంట్ అన్నట్లు ఇంకా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ ఆలోచనలన్నీ కూడా దేశాన్ని విభజించిన ముస్లిం లీగ్ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయని దుయ్యబట్టారు. స్వతంత్ర్య ఉద్యమ కాలం నాటి కాంగ్రెస్ అప్పుడే అంతమయిందని మోదీ అన్నారు.
"ఎందరో మహానుభావులు కాంగ్రెస్‌తో అనుబంధం పెంచుకున్నారు. మహాత్మా గాంధీ పేరు కాంగ్రెస్‌తో ముడిపడి ఉంది. నేడు మిగిలి ఉన్న కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాలకు సంబంధించిన విధానాలు లేదా దేశాభివృద్ధికి సంబంధించిన దృక్పథాలు లేవు" అని ప్రధాన మంత్రి మోదీ అన్నారు.
"నిన్న, ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబడింది, నేటి భారతదేశం యొక్క ఆశలు, ఆకాంక్షల నుంచి నేటి కాంగ్రెస్ పూర్తిగా దూరం జరిగింది. దాని అనుబంధం తెగిపోయిందని రుజువు చేసింది" అని ఆయన సహరాన్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి అన్నారు.
కాంగ్రెస్ కనిపించదు
‘ఇండి’ కూటమిలో భాగస్వామి, యూపీలో ప్రధాన ప్రతిపక్షం అయినా కాంగ్రెస్ ఎన్నికల భాగస్వామి సమాజ్‌వాదీ పార్టీపై కూడా ప్రధాని మోదీ చురకలంటించారు.
"ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ (సమాజ్‌వాదీ పార్టీ) పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఇక్కడ వారు ప్రతి గంటకు ఒక్క కొత్త అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. దీనికి మించి కాంగ్రెస్ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. కాంగ్రెస్‌కు అభ్యర్థులు అస్సలు దొరకడం లేదు" అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ కంచుకోటగా భావించిన సీట్లలో కూడా అభ్యర్థులను నిలబెట్టే ధైర్యం చేయలేక పోతున్నదని అమేథీ, రాయ్ బరేలీలను ఆయన ప్రస్తావించారు. ఇండి కూటమి అస్థిరత, అనిశ్చితికి మరో పేరుగా మారిందని ప్రధాని మోదీ విమర్శించారు. "అందుకే ఈ రోజు దేశం వారు చెప్పిన ఒక్క విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు" అన్నారాయన.
ఎస్పీ-కాంగ్రెస్ కూటమి విఫలమైంది
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ల పేరును ప్రస్తావించకుండా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అబ్బాయిలు నటించిన చిత్రం ('దో లడ్కే') గతసారి ఫ్లాప్ అయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇద్దరు అబ్బాయిల సినిమాని వీళ్లే మళ్లీ రిలీజ్ చేశారు.
"ఈ INDI కూటమి సభ్యులు చెక్క కుండ (మంట) ఎన్నిసార్లు వేస్తారో నాకు అర్థం కావడం లేదు?" మోదీ చలోక్తులు విసిరారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేశాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాలయినా సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్ పిలిభిత్ లో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.