60 ఏళ్ల తర్వాత అత్త ఇందిర బాటలో కోడలు సోనియా!

మాజీ ప్రధాని ఇందిర తర్వాత గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్న రెండో వ్యక్తి సోనియా.

Update: 2024-02-16 04:30 GMT
Indira, Sonia Graphics

ఆమె పేరు సోనియా. అసలు పేరు ఆంటోనియో మైనో. పుట్టింది ఇటలి. రాణించింది ఇండియా.. ఇప్పుడామె వయసు 77.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. 25 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలు చేశారు. పార్లమెంటు రాజకీయాల్లో ఆరితేరకపోయినా అందర్నీ కనిపెట్టుకుంటూ వచ్చారు. 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా పని చేసిన ఖ్యాతి సంపాయించారు. ఇకపై పరోక్ష రాజకీయాలు చేయబోతున్నారు. 60 ఏళ్ల తర్వాత ఆమె తన అత్త ఇందిరా గాంధీ నడిచిన బాటలో నడవబోతున్నారు. ఇందిరా గాంధీ ప్రధాని కావడానికి ముందు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. సమాచార శాఖ మంత్రిగా ఉంటూ ప్రధాని అయ్యారు. అయితే అప్పటికి ఇందిర వయసు 47 ఏళ్లు కాగా సోనియా ప్రస్తుత వయసు 77. ఎనిమిది పదుల వయసులోనైనా ప్రధాని అవుతారామో కాలమే చెప్పాలి.


రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 15తో నామినేషన్ల గడువు ముగిసింది. ఐదుసార్లు లోక్ సభ సభ్యురాలు అయిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నిక లాంఛనమే కావొచ్చు. రాజస్థాన్ లో ఆమె ఎన్నిక కావడానికి తగినన్ని ఓట్లు కాంగ్రెస్‌కు ఉన్నాయి. సోనియా తొట్టతొలిసారి ఎగువ సభ రాజ్యసభ మెట్లు ఎక్కబోతున్నారు. దీంతో ఆమె అత్తగారి పుట్టిల్లయిన ఉత్తరప్రదేశ్ తో రాజకీయ అనుబంధం తెగిపోనుంది. 1999 నుంచి రాయ్‌బరేలీ లోక్‌సభ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. 77 ఏళ్ల సోనియా రాజ్యసభలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.

‘సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయమని కోరాం. తెలంగాణ నుంచి ఇందిరా గాంధీ ఎన్నికైన చరిత్ర ఉంది. ఆ నేపథ్యంలో పోటీ చేయమని కోరాం. వివిధ కారణాల దృష్ట్యా సోనియమ్మ రాజస్థాన్ ను ఎంచుకున్నారు’ అన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు. రాజస్థాన్ ను ఆమె ఎంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం లేకపోలేదు. ఇప్పటికే ఆమె కుమారుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తల్లీ, కుమారుడు- ఇద్దరూ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఉత్తరాది రాష్ట్రాలను వదిలేశారనే భావన వస్తుందని ఊహించి ఉండవచ్చు. పైగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా దక్షిణాది నుంచే ఉన్నారు. అందుకనే సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపి ఉంటారని, వచ్చే ఎన్నికల్లో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ యూపీ లోని రాయబరేలి నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు.

హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్లు కూడా సోనియా గాంధీని తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని కోరాయి. ‘గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు చెప్పిన ప్రకారం సోనియాకి కూడా ఉత్తర భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించడానికే ఇష్టపడతారు’ చెప్పారు. నలుగురు కీలక కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సోనియా గాంధీ తొలిసారిగా 1999లో అమేథీ, బళ్లారి (కర్ణాటక) నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె అమేథీ సీటును అట్టిపెట్టుకుని బళ్లారికి రాజీనామా చేశారు. 2004లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయడంతో ఆమె రాయ్‌బరేలీకి మారారు. సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తన నియోజకవర్గాన్ని చాలా తక్కువ సార్లు మాత్రమే సందర్శించగలిగారు.

ఇందిర బాటలో సోనియా...

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికై ఇప్పటికి దాదాపు 60 ఏళ్లు. తండ్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు ఎంపిక చేసింది కాంగ్రెస్‌. నెహ్రూ ఏకైక సంతానం ఇందిర. రాజ్యసభకు ఎన్నికైన వెంటనే ఇందిరమ్మను కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రిని చేశారు అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ. ఆయన మరణానంతరం ఇందిరా ప్రియదర్శిని 1966 జనవరి చివర్లో ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా రాజ్యసభ ఎంపీగానే ప్రధాని అయిన తొలి నేతగా ఇందిర చరిత్రకెక్కారు. ఏడాది తర్వాత జరిగిన 1967 ఫిబ్రవరి ఎన్నికల వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఇందిర అదే నెలలో లోక్‌ సభకు తొలిసారి ఎన్నికవ్వడమేగాక రెండోసారి ప్రధాని అయ్యారు. మళ్లీ నెహ్రూ–గాంధీ (ఇందిరాగాంధీ ఫ్యామిలీ) కుటుంబ సభ్యులు రాజ్యసభకు సోనియాగాంధీ ఎన్నికతో రెండోసారి అవుతుంది. ఇందిరమ్మ తాను పుట్టిన యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా, ఆమె కోడలు సోనియా ఇప్పుడు యూపీ సరిహద్దులోని రాజస్తాన్‌ నుంచి ఎన్నికకానున్నారు.

ఇందిర గాంధీ రాజ్యసభకు దాపు 47 ఏళ్ల వయసులో ఎన్నికైతే, ఆమె ఇటలీ కోడలు సోనియా గాంధీ 77 ఏళ్ల వయసులో అడుగుపెట్టబోతున్నారు. లోక్‌ సభ 18వ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు సోనియా తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్ కు ఎంత మేలు చేస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News