అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ పంపిన సమన్లపై ముందస్తు రక్షణ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వూలు ఇవ్వలేమని.. ఇంకా ఏమన్నారంటే..
By : The Federal
Update: 2024-03-21 13:41 GMT
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ చేసే విచారణ నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.
ఏప్రిల్ 22న విచారణకు రావాలని ఈడీ పంపిన సమన్లను సవాలు చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ సురేష్ కుమార్ కైట్, మనోజ్ జైన్ లతో కూడిన ధర్మాసనం విచారించి కేసును లిస్ట్ చేసింది.
"మేము రెండు వైపులా మీ వాదనలు విన్నాము మేము ఈ దశలో రక్షణ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాం. ప్రతివాదికి సమాధానం రాబట్టుకోవడానికి తగినంత స్వేచ్చ ఉంది" అని బెంచ్ పేర్కొంది. తాజాగా గురువారం తన ఎదుట హాజరుకావాలని ఈడి జారీ చేసిన తొమ్మిదో సమన్ల నేపథ్యంలో కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా, ఆప్ చీఫ్ తరఫు సీనియర్ న్యాయవాది ఈరోజు జారీ చేసిన సమన్లను వాయిదా వేయాలని కోరారు. అయితే దీనిపై ఈడీ తరఫున అదనపు సొలిటర్ జనరల్ ఎస్ వీ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సమయం వృథా చేశారని కోర్టుముందుకు తీసుకొచ్చారు. కేజ్రీవాల్ పదే పదే సమన్లను నిరాకరిస్తున్నారని, అసలు విచారణకే హాజరుకావడం లేదని న్యాయమూర్తులకు విన్నవించారు.
2021-22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ సందర్భంగా భారీ అవినీతి జరిగిందని ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో వందల కోట్లు చేతులు మారాయని దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.
ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఇతర నిందితులు ఎక్సైజ్ పాలసీని రూపొందించినందుకు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నారని, దాని ఫలితంగా తమకు అనవసరమైన ప్రయోజనాలు చేకూర్చాయని, దానికి ప్రతిఫలంగా వారు ఆప్‌కి కిక్‌బ్యాక్ చెల్లించారని ఏజెన్సీ ఆరోపించింది.