ఢిల్లీ: ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ తో తగ్గిన అమ్మకాలు
పండగ సందర్భంగా కూడా అంతంత మాత్రంగానే అమ్మకాలు
By : The Federal
Update: 2025-12-23 10:53 GMT
బీఎస్-6 కానీ వాహానాల నిషేధం, ‘నో పీయూసీ, నో ఫ్యూయల్’ నిబంధన తరువాత దేశ రాజధాని అంతటా మార్కెట్లలో అమ్మకాలు, రద్దీ తగ్గినట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) తక్కువ మంది కొనుగోలుదారులు ఢిల్లీలోని కీలక షాపింగ్ హబ్ లకు వస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన సదర్ బజార్, పొరుగున ఉన్న ఎన్సీఆర్ పట్టణాల నుంచి వచ్చే రిటైలర్లపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
అయితే జనాభా ఫ్లోటింగ్ తగ్గడం వల్ల అమ్మకాలు దాదాపు 30 నుంచి 35 శాతం తగ్గాయని సదర్ బజార్ అసోసియేషన్ చైర్మన్ పరంజిత్ సింగ్ పమ్మ అన్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ వెలుపలి నుంచి కొనుగోలుదారులు తమ వ్యాపారాలను పరిమితం చేసుకున్నారని పమ్మా చెప్పారు.
‘‘ఎన్సీఆర్ నుంచి రిటైలర్లు తక్కువగా వస్తున్నందున మా అమ్మకాలలో దాదాపు 30-35 ప్రభావితమయ్యాయి’’ అని ఆయన అన్నారు. పండగ సీజన్ ప్రారంభం కావడంతో దీని ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోందని వ్యాపారులు తెలిపారు.
‘‘మా దగ్గర క్రిస్మస్ నూతన సంవత్సర స్టాక్ పేరుకుపోయింది. కానీ గత సంవత్సరంతో పోలిస్తే కొనుగోలుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద జనసంచారం దాదాపు 35 శాతం తగ్గింది’’ అని పమ్మా ఆవేదన వ్యక్తం చేశారు.
శీతాకాలపు షాపింగ్ కు ప్రసిద్ది చెందిన సరోజిని నగర్ మార్కెట్ లోని వ్యాపారులు కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తం చేశారు. గతవారం రోజులుగా జనం తగ్గిపోయారని సరోజిని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ రాంధవా అన్నారు.
‘‘ప్రజల రద్దీ దాదాపు 40 శాతం తగ్గింది. కొన్ని రోజుల్లోనే అమ్ముడు పోయే శీతాకాలపు దుస్తులు ఇప్పుడు అమ్ముడు పోకుండా పడి ఉన్నాయి. ఎందుకంటే ఎన్సీఆర్ నుంచి వినియోగదారులు రావడం లేదు’’ అని ఆయన అన్నారు.
దక్షిణ ఢిల్లీ మార్కెట్లలోని వ్యాపారులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆంక్షలు దుకాణదారులను, చిన్న వ్యాపారులను ప్రభావితం చేశాయని లజపత్ నగర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కుల్దీప్ కుమార్ అన్నారు.
‘‘గత కొన్ని రోజులుగా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇది రోజువారీ అమ్మకాలపై, ముఖ్యంగా దుస్తుల మార్కెట్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది’’ అని కుమార్ అన్నారు.
వాయు నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో అధికారులు కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేయడంతో ఈ ఆంక్షలు విధించింది. గురువారం బీఎస్ -6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని ఢిల్లీ వెలుపలి నుంచి ప్రైవేట్ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించాయి.
అదనంగా నో పీయూసీ, నో ఫ్యూయల్ నియమం అమల్లోకి వచ్చింది. దీనికింద చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ(పీయూసీ) సర్టిఫికెట్ లేకుండా ఇంధన కేంద్రాలు వాహానాలను ఇంధనాన్ని పంపిణీ చేయడాన్ని నిషేధించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, పెట్రోల్ పంపుల వద్ద వాయిస్ అలర్ట్, పోలీస్ మద్దతుతో ఉపయోగించి అమలు చేస్తున్నారు.