పిల్లలకు దగ్గుమందు సజెస్ట్ చేసిన వైద్యుడి అరెస్ట్
కోల్డ్రీప్ సిరప్ తాగి మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో 14 మంది చిన్నారుల మృతి
By : The Federal
Update: 2025-10-05 06:53 GMT
మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో కలుషితమైన దగ్గు మందు తాగి 11 మంది పిల్లలు మరణానికి కారణమైన వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. చింద్వారాలోని పరాసియాకు చెందిన పిల్లల వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ కు చెందిన సోనీ క్లినిక్ లో పిల్లలకు చికిత్స జరిగిందని, ఇక్కడే ఆయన ఈ సిరప్ ను సూచించినట్లు తెలుస్తోంది.
ఆయన ప్రభుత్వ వైద్యుడు అయినప్పటికీ ప్రయివేట్ క్లినిక్ ను నడుపుతున్నారని, తన దగ్గరకి వచ్చిన పిల్లలకు కలుషితమైన సిరప్ సూచించారని తేలింది.
పిల్లలకు అందించిన కోల్డ్రీఫ్ ను తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసింది. దీనిపై కూడా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సిరప్ నమూనాలలో 48 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత విషపూరితమైన పారిశ్రామిక రసాయనం అని నిర్ధారణ కావడంతో వెంటనే దీనిని నిషేధించారు.
తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ కింద చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబోరేటరీ నిర్వహించిన పరీక్షలలో సిరప్ కు నాణ్యత లేదని తేలింది. ఈ విషయం మధ్యప్రదేశ్ అధికారులకు తెలియడంతో ముందు జాగ్రత్తగా కోల్డ్రిప్, నెక్స్టో డీఎస్ పై నిషేధం విధించారు.
బాధితుల వాదన ప్రకారం...
సెప్టెంబర్ లో ప్రారంభంలో పిల్లలకు జలుబు, జ్వరం వంటి తేలికపాటి లక్షణాలు కనిపించాయి. వారు వైద్యులను సంప్రదించడంతో వారికి దగ్గు సిరప్ ను సూచించారు. మొదట్లో ఆరోగ్యం బాగానే ఉన్న తరువాత పూర్తిగా దిగజారింది.
మూత్ర విసర్జన చేయకపోవడం, మూత్ర పిండాలలో సమస్యతో చిన్నారులు మరణించారు. వీరికి నిర్వహించిన బయాప్సీలో సిరప్ నమూనాలో ఉన్న డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు తేలింది.
చనిపోయిన చినారులలో 11 మంది పరాసియాకు చెందిన వారు. ఇద్దరు చింద్వారాకు చెందిన వారు కాగా, మరొకరు చిరాయ్ కు చెందినవారు. మరణించిన 14 మంది పిల్లల బంధువులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం ప్రకటించింది.
డ్రగ్ రెగ్యూలేటర్ దర్యాప్తు బృందం..
ఈ సంఘటన జరిగిన తరువాత డ్రగ్ రెగ్యూలేటర్ దర్యాప్తు బృందం(సీడీఎస్సీఓ) ఆరు రాష్ట్రాల్లోని దగ్గు సిరప్ లు, యాంటీ బయాటిక్ లతో సహ 19 ఔషధాల తయారీ యూనిట్లలో రిస్క్ ఆధారిత తనిఖీలను ప్రారంభించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సీడీఎస్సీఓ, ఎయిమ్స్- నాగ్ పూర్ వంటి నిపుణులతో కూడిన బృందం చింద్వారా, దాని చుట్టుపక్కల జరిగిన మరణాలకు అంచనా వేయడానికి నమూనాలను సేకరిస్తోందని తెలిపింది.
కొంతమంది బాధితుల నుంచి నమూనాలను సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. సిరప్ కల్తీ, కాలుష్యంపై అదనపు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విషాదకరమైన అంశం..
ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. ఇది చాలా విషాదకరమైనదిగా అభివర్ణించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
‘‘కోల్డ్రీఫ్ కారణంగా చింద్వారాలో పిల్లలు మరణించడం చాలా విషాదకరం. ఈ సిరప్ అమ్మకాలను మధ్యప్రదేశ్ అంతటా నిషేధం విధించాం. ఈ సిరప్ తయారు చేస్తున్న కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధిస్తాం’’ అని సీఎం ఎక్స్ లో ట్వీట్ చేశారు. కోల్డ్రీఫ్ తయారీ కేంద్రం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నందున దానిని పరీక్షించాలని కూడా తమిళనాడు అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు.
‘‘ఈ ఉదయం దర్యాప్తు నివేదిక అందింది. నివేదిక ఆధారంగా కఠినచర్యలు తీసుకున్నారు. పిల్లల విషాద మరణాలు తరువాత స్థానికంగానూ చర్యలు ప్రారంభించాము.
దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం’’ అని ఆయన అన్నారు. కోల్డ్రిఫ్ అమ్మకాలపై రాజస్థాన్, తమిళనాడు, కేరళ కూడా నిషేధం విధించాయి.