బాంబుదాడికి పాల్పడింది డాక్టర్ ‘ఉమర్ నబీనే’
అతడి తల్లి డీఎన్ఏతో సరిపోలిన కారులోని అవశేషాలు, దీపావళి పండగ, గణతంత్య్ర దినోత్సవం నాడు భారీ విధ్వంసానికి వైద్య ఉగ్రవాదుల కుట్ర
By : The Federal
Update: 2025-11-13 05:39 GMT
చారిత్రాత్మక ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబుదాడికి పాల్పడింది అల్ ఫలాహ్ వైద్య విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేలిపోయింది. పుల్వామాలోని ఉన్న ఉగ్రవాది తల్లి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలు, ఘటనా స్థలం నుంచి సేకరించిన శరీర భాగాల నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాతో సరిపోలాయి.
పేలుడులో ఎవరు చనిపోయారనే దానిపై అధికారుల అనుమానాలు ఈ రిపోర్ట్ తో నివృత్తి అయ్యాయి. మంగళవారం పుల్వామకు కు వెళ్లిన ప్రత్యేక వైద్యబృందం ఉమర్ తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు తీసుకున్నారు.
‘‘ఢిల్లీ కారు బాంబు పేలుడులో చనిపోయింది ఉమన్ అని నిర్ధారణ అయింది’’ అని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వైట్ కాలర్ ఉగ్రవాదంలో ఉమర్ కీలకపాత్ర పోషించాడని తేలింది. ప్రధాని నిందితుడు ఉమర్ జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లా కోలీ గ్రామానికి చెందినవాడు.
బాంబు దాడికి ప్రణాళికలు..
బాంబుదాడికి ఉపయోగించిన ఐ20 హ్యూందాయ్ కారును ఉమర్ కేవలం 11 రోజుల ముందే కొనుగోలు చేశాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. డీఎన్ఏ నమూనాల ప్రకారం అతడు కారులోనే ముందు భాగంలో ప్రయాణిస్తున్నాడని తేలిపోయింది.
పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైష్ ఏ మహ్మద్ కోసం వీరంతా ఫరిదాబాద్, లక్నో, దక్షిణ కశ్మీర్ లో మాడ్యూల్స్ నిర్వహిస్తున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఉగ్రవాద ముఠాలో కనీసం తొమ్మిది నుంచి పదిమంది ఉన్నారని, ఇందులో ఐదు నుంచి ఆరుగురు వైద్యులు ఉన్నారని అనుమానిస్తున్నారు. వారి వైద్య వృత్తిని అడ్డుపెట్టుకుని రసాయనాలు సేకరించారని ప్రాథమికంగా గుర్తించారు.
ఫరీదాబాద్, లక్నో లోని వీరి ఉగ్రవాద కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించి 2900 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్న నవంబర్ 9 నుంచి ఉమర్ అదృశ్యమయ్యాడు.
అయితే అక్టోబర్ 30 నుంచి ఉమర్ విధులకు దూరంగా ఉన్నాడని, తనకున్న ఐదు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడని, దావుజీ గ్రామంలోకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా తమ విచారణన వేగవంతం చేశారు.
ఈ ఉగ్రవాద మాడ్యూల్ లో కీలకవ్యక్తిగా ఉన్నా మాజీ వైద్య ఉపాధ్యాయురాలు డాక్టర్ షాహిన్ షాహిదీని పోలీసులు ఫరీదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈమె జేఈఎం మహిళా విభాగమైన జమాత్ ఉల్ ముమీన్ కు భారత్ లో నేతృత్వం వహిస్తున్నారని, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే కుట్రలో కీలక భాగస్వామి అని దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు.
ఈ కుట్రలో భాగస్వాములైన మరో ఇద్దరు వైద్యులైన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, డాక్టర్ తాజ్ముల్ అహ్మద్ మాలిక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాద ఘటన తరువాత జమ్మూకశ్మీర్ లోని దక్షిణ కశ్మీర్ లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న జమాత్ ఏ ఇస్లామీ అనుచరులే లక్ష్యంగా దాడులు చేశారు. ఇందులో మౌల్వీ ఇర్ఫాన్ ను అరెస్ట్ చేశారు. ఇతడే యువ వైద్యులను రాడికలైజ్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లించాడని తేలింది.
ఎర్రకోటే లక్ష్యంగా ప్రణాళిక..
వచ్చే ఏడాది ఎర్రకోట కేంద్రంగా జరిగే గణతంత్య దినోత్సవం లక్ష్యంగా వీరు రెక్కి నిర్వహించారని, ఈ వేడుకలతో పాటు దేశ రాజధానిలోని చాలా ప్రాంతాలలో ఏకకాలంలో దాడులకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తేలింది.
బాంబుదాడికి పాల్పడిన ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ గనై వారి హ్యండ్లర్లు తుర్కియో(టర్కీ) వెళ్లారని, అక్కడే వారు ఉగ్రవాదం వైపు మళ్లారని అధికారులు గుర్తించారు.
నబీ, గనై ఇద్దరు టెలిగ్రామ్ గ్రూపులో చేరిన కాసేపటికే వారికి తుర్కియే వెళ్లడానికి పాస్ పోర్టులు లభించాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. తుర్కియే నుంచి వచ్చాక దేశవ్యాప్తంగా బాంబుదాడులు చేయాలని లక్ష్యంగా ప్రణాళికలు రచించారు.
దీపావళీ సందర్భంగా రద్దీ ఉండే ప్రాంతాలలో బాంబు దాడులకు ప్రణాళికలు కూడా వేసుకున్నారని కానీ అది చేయలేకపోయారని తెలిసింది. పాకిస్తాన్ కేంద్రంగా జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాది ఉమర్ బిన్ ఖత్తాబ్ తో వీరికి నిరంతరం సంప్రదింపులు జరిగాయని తెలిసింది. ముంబై పై 2008 లో జరిగిన 26/11 తరహ దాడి చేయాలని వీరు భావించారని కూడా అధికారులు భావిస్తున్నారు.