కొత్త ‘జిన్నా’ లు ఉద్భవించకూడదు: యోగీ ఆదిత్యనాథ్

పాఠశాలలో వందేమాతరం తప్పనిసరి చేస్తామని ప్రకటించిన యూపీ సీఎం

Update: 2025-11-10 12:10 GMT
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. దేశంలోని మరో కొత్త జిన్నా ఉద్భవించకూడదంటే భారత్ పై ప్రేమ పెరగాలని అన్నారు.

జాతీయ గీతంపై రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. వందేమాతరం గేయంలోని కీలకమైన భాగాలను 1937 లో తొలగించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు.

గోరఖ్ పూర్ లో జరిగిన ఏక్తాయాత్ర(ఐక్యతా ర్యాలీ) కార్యక్రమంలో యూపీ సీఎం మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలలో వందేమాతరం పాడటం తప్పనిసరిగా చేస్తామని యూపీ ముఖ్యమంత్రి వెల్లడించారు.
జాతీయగీతాన్ని గౌరవించడం..
విద్యార్థులలో భారత మాత పట్ల లోతైన భక్తి గర్వాన్ని పెంపొందించడమే ఈ చర్య లక్ష్యమని ఆయన వివరించారు. ‘‘జాతీయ గీతం వందేమాతరం పట్ల గౌరవం ఉండాలి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రతి విద్యా సంస్థలోనూ దానిని తప్పనిసరిగా పాడేలా చూస్తాము’’ అని ఆదిత్యనాథ్ చెప్పినట్లు జాతీయ మీడియా వార్తా కథనాలు ప్రసారం చేసింది.
కొత్త జిన్నా రాకూడదు..
‘‘దేశంలో కొత్త జిన్నా ఎప్పటికీ ఉద్భవించకూడదు. విభజన లక్ష్యాలు వేళ్లూనుకూనే అవకాశం రాకముందే వాటిని సమాధి చేయాలి’’ అని గోరఖ్ పూర్ లో ప్రకటించారు. జిన్నా కారణంగానే 1947 లో దేశ విభజన జరిగింది.
కాంగ్రెస్ విమర్శలు..
జాతీయ గేయంలోని కీలకమైన భాగాలను 1937 లో తొలగించారని, ఇదే దేశ విభజనకు దోహదపడిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ రకమైన విభజన మనస్తత్వం దేశానికి ఇంకా సవాల్ గా కొనసాగుతోందని అన్నారు.
ప్రధాని చేసిన విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ పాటకు సంబంధించి ప్రకటన విడుదల చేసిన 1937 కాంగ్రెస్ వర్కిగ్ కమిటీ, నోబెల్ గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ ను ప్రధాని అవమానించారని విమర్శించింది.
‘‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కోల్ కతలో అక్టోబర్ 26, నవంబర్ 1, 1937 మధ్య సమావేశం అయింది. ఇందులో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజేంద్ర ప్రసాద్, అబుల్ కలాం ఆజాద్, జేబీ సర్పరాజ్, దేశాయ్, జమ్నాలాల్ బజాజ్, నరేంద్ర దేవా హజరయ్యారు’’ అని ఆ పార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇదే పోస్ట్ లో ఇంకా ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, వాల్యూమ్ 66, పేజీ నంబర్ 46 ను ఉదహరించారు. సీడబ్ల్యూసీ అక్టోబర్ 28, 1937 న వందేమాతరం పై ఒక ప్రకటన విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వం ద్వారా లోతుగా రూపొందించినట్లు పేర్కొన్నారు.
ప్రధాని రవీంద్రనాథ్ ఠాగూర్, సీడబ్ల్యూసీని అవమానించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే సమకాలీన అంశాలపై తన రాజకీయ ప్రసంగాన్ని కేంద్రీకరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే వేడుకలను ప్రారంభిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News