తొమ్మిదోసారి కేజ్రీవాల్ కు నోటీసులు పంపిన ‘ఈడీ’
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈ డీ తొమ్మిదోసారి నోటీసులు పంపింది.
By : The Federal
Update: 2024-03-17 06:12 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రికి తొమ్మిదో సారి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అయింది. ఇప్పటికీ ఎనిమిది సార్లు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసిన కేజ్రీవాల్ విచారణకు హజరుకాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.
సెంట్రల్ ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు పంపిన సమన్లలో దర్యాప్తు సంస్థ కోరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు ఈ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో గతంలో వచ్చిన ఎనిమిది సమన్లలో ఆరింటిని దాటవేయడంపై ఏజెన్సీ దాఖలు చేసిన రెండు ఫిర్యాదులపై ఢిల్లీ కోర్టు శనివారం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కె.కవితను రెండు రోజుల క్రితం ఏజెన్సీ అరెస్టు చేసింది.
ఈ కేసులో వందల కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అరెస్ట్ అయిన పలువురు నిందితులు అప్రూవర్ గా మారడంతో కేసు దర్యాప్తులో వేగం పెరిగింది. ఇందులో ముడుపులు అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల సందర్భంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.