కుల్గాంలో ఎన్ కౌంటర్, ఇద్దరు సైనికుల వీరమరణం
హతమారిన ఇద్దరు ఉగ్రవాదులు, అఖల్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కిక పాక్ ఉగ్రవాదులు;
By : The Federal
Update: 2025-08-09 07:04 GMT
జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో రాత్రిపూట జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. పలువురు సైనికులు గాయపడినట్లు సమాచారం. ఆగష్టు 1 న కశ్మీర్ లోయలో ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ అత్యంత సుదీర్ఘమైన వాటిలో ఒకటి.
ఇది నిన్నటితో 9 వ రోజుకు చేరుకుంది. ఆపరేషన్ సమాచారాన్ని చినార్ కార్ప్స్ ఆఫ్ ది ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఎన్ కౌంటర్ లో మరణించిన సైనికులకు నివాళులర్పించింది. ఆపరేషన్ కొనసాగుతుందని ప్రకటించింది.
‘‘దేశం కోసం విధి నిర్వహణలో వీర సైనికులైన లాన్స్ నాయక్ ప్రిత్ పాల్సింగ్, హర్మీందర్ సింగ్ ల అత్యున్నత త్యాగాన్ని చినార్ కార్ప్స్ గౌరవిస్తుంది. వారి ధైర్యం, అంకితభావం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది.
ఇండియన్ ఆర్మీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది. అమరవీరుల కుటుంబాలకు సంఘీభావంగా నిలుస్తుంది. ఆపరేషన్ కొనసాగుతోంది. ’’ అని చినార్ కార్ఫ్స్ పేర్కొంది.
ఇద్దరు ఉగ్రవాదులు హతం..
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్ వద్ద ఉన్న అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేసి ఆపరేషన్ ప్రారంభించాయి. ఇక్కడ ఆగష్టు 1న ఈ మిషన్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకూ ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు హతమారిపోయారు. మరణించిన వారు ఏ గ్రూపుకు చెందిన వారో ఇంకా గుర్తించలేదు.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. రాత్రిపూట జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దీనితో ఈ ఎన్ కౌంటర్ లో గాయపడిన సైనికుల సంఖ్య 9 కి చేరింది.
జమ్మూకాశ్మీర్ పోలీస్ చీఫ్ నళిన్ ప్రభాత్,, ఆర్మీ నార్తర్న్ కమాండ్ లెప్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మతో సహ సీనియర్ పోలీస్, ఆర్మీ అధికారులు 24 గంటలూ ఆపరేషన్ ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని నివేదిక పేర్కొంది.
డ్రోన్లు, హెలికాప్టర్ లు..
అఖల్ లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి వారిని మట్టుబెట్టడానికి భద్రతా దళాలు డ్రోన్లు, హెలికాప్టర్లను రంగంలోకి దింపాయి. దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలకు సాయం చేయడానికి పారా కమాండోలను మెహరించారు.
దట్టమైన అటవీ ప్రాంతంలోని లక్ష్యాలపై డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలను విడిచిపెట్టినట్లు ఎన్డీటీవీ తెలియజేసింది. ‘‘కఠినమైన భూభాగం, అటవీ ప్రాంతం కారణంగా ఆపరేషన్ పూర్తి చేయడానికి సమయం పడుతోంది.
కానీ మేము వారిని ట్రాక్ చేస్తాము’’ అని ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న జేఅండ్ కే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్ చెప్పినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. ఆ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందిందని, వారిలో ముగ్గురు పాక్ జాతీయులని నివేదిక పేర్కొంది.