హైవేపై వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం, 20 మంది సజీవ దహనం
తీవ్రంగా గాయపడిన 16 మంది
By : The Federal
Update: 2025-10-15 07:49 GMT
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జైసల్మెర్ నుంచి జోధ్ పూర్ వెళ్తున్న ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగిన బస్సు, జైసల్మేర్ నుంచి బయల్దేరిందని, ఆ సమయంలో బస్సులో 57 మంది ఉన్నట్లు తేలింది. జైసల్మేర్- జోధ్ పూర్ హైవేపై బస్సు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా వెనకభాగం నుంచి మంటలు వ్యాపించాయి. దీనిని గమనించి డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. కానీ అందరు బయటకు వచ్చే సమయంలోపే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది.
విషమంగా 16 మంది
బస్సు ప్రమాదం హైవేపై జరగడంతో ఆ దారిలో వెళ్తున్న అనేకమంది సాయం చేశారు. ఆర్మీ సిబ్బంది కూడా సహాయక చర్యలలో పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
గాయపడిన వారిని జైసల్మేర్ లోని జవహార్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని జోధ్ పూర్ కు తరలించారు. బస్సులో చెలరేగిన మంటలలో 20 మంది మరణించినట్లు పోకరన్ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ పూరి జాతీయ మీడియాకు తెలిపారు.
‘‘బస్సులోనే 19 మంది సజీవ దహానం అయ్యారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు’’ అని ఆయన చెప్పారు. జైసల్మేర్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు బస్సులో మంటలు చేలరేగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సరైన వైద్యం అందించండి: సీఎం భజన్ లాల్ శర్మ
ప్రమాద సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వెంటనే జైసల్మేర్ చేరుకున్నారు. గాయపడిన వారికి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు.
‘‘జైసల్మేర్ లో బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చాలా హృదయ విదారకరం. ఈ విషాద సమయంలో బాధితులైన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి సరైన వైద్య చికిత్స అందించాలని, బాధితులకు సాధ్యమైనంత సాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాము’’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఈ విషాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫును రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను కూడా ప్రకటించారు.
‘‘రాజస్థాన్ లోని జైసల్మేర్ లో బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో అనేక మంది మరణించారనే వార్తా చాలా హృదయ విదారకంగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాష్ట్రపతి ఎక్స్ లో ట్వీట్ చేశారు.
బస్సు ప్రమాదం గురించి తెలియగానే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు జైసల్మేర్ జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్లు కూడా జారీ చేసినట్లు తెలిపారు.