రాజ్యసభ చరిత్రలో తొలిసారి చైర్మన్ అవిశ్వాస తీర్మానం : కాంగ్రెస్

సభా వ్యవహరాలు కక్ష పూరితంగా నిర్వహిస్తున్నారని ఇండి కూటమి ఆరోపణ

Update: 2024-12-10 13:14 GMT

రాజ్యసభలో అధికార పార్టీకి అనుకూలంగా కక్ష పూరితంగా సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చైర్మన్ జగదీప్ ధన్కర్ పై ఇండి కూటమి అవిశ్వాస తీర్మానం సమర్పించింది. ఈ విషయంపై ఎంపీ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. “రాజ్యసభ 72 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి, ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించాయి. ఇదే కాలంలో లోక్‌సభ స్పీకర్‌పై మూడు సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు’’ అని ట్వీట్ చేశారు.

ఈ తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఐ(ఎం), జేఎంఎంలకు చెందిన 60 మంది ప్రతిపక్ష ఎంపీల నుంచి మద్దతు సంతకాలు అందాయని పీటీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడిని తొలగించే తీర్మానానికి కనీసం 50 మంది సంతకాలు చేయాలి. రాజ్యాంగంలోని అధికరణ 67(బి) ప్రకారం “ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని అతని పదవి నుండి తొలగించవచ్చు. ఓటింగ్ జరగడానికి 14 రోజుల ముందు చైర్మన్ కు నోటీసు అందిస్తారు.
వాయిదా పడిన రాజ్యసభ..
అధికార ఎన్‌డిఎ కూటమి ప్రతిపక్ష ఇండి కూటమి సభ్యులు సభను నడపనివ్వకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో రాజ్యసభ మంగళవారం మళ్లీ వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. 'పార్లమెంట్‌ను అధికార పార్టీ నిర్వహించనివ్వకపోవడం దేశ దురదృష్టం. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటును పిలుస్తారు. అధికార పక్షం సభా కార్యక్రమాలను అడ్డుకోవడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని ఆక్షేపించారు.
గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన కొనసాగించారు.


Tags:    

Similar News