‘‘ఓటర్ల జాబితా నుంచి మినహయించిన వారి వివరాలు ఇవ్వండి’’
ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు.. జాబితా నుంచి 3.66 లక్షల మంది తొలగింపు
By : The Federal
Update: 2025-10-07 12:15 GMT
బీహార్ లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తరువాత తయారు చేసిన తుది జాబితా నుంచి వేరు చేసిన 3.66 లక్షల ఓటర్ల జాబితాను తమకు అందించాలని సుప్రీంకోర్టు ఈసీని మంగళవారం ఆదేశించింది.
జాబితాలో చేర్చబడిన పేర్లలో ఎక్కువ మంది కొత్త ఓటర్లేనని, ఇప్పటి వరకూ ఏ ఒక్క ఓటర్ కూడా ఫిర్యాదు లేదా అప్పీల్ చేయలేదని ఈసీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 9న విచారణ..
సర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలయిన అన్ని పిటిషన్ లను గురువారం విచారించబోతున్నందున ఓటర్ల గురించి తమకు లభించే ఏ సమాచారం అయిన పోల్ ప్యానెల్ సమర్పిస్తుందని జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
కోర్టు ఆదేశాల వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఏర్పడుతుందని పోల్ ప్యానెల్ తరఫున హజరైన సీనియర్ న్యాయవాదీ రాకేశ్ ద్వివేదితో జస్టిస్ బాగ్చి అన్నారు.
తుది జాబితాలోని ఓటర్ల సంఖ్యను బట్టి డ్రాప్ట్ రోల్స్ నుంచి సంఖ్యల పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తున్నందున, ఎటువంటి గందరగోళాన్ని నివారించడానికి యాడ్ ఆన్ ల గుర్తింపులను బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది.
‘‘ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత స్థాయి మెరుగుపడిందని మీరు మాతో అంగీకరిస్తారు. మీరు ప్రచురించిన ముసాయిదా జాబితాలో 65 లక్షల తొలగింపు జరిగినట్లు డేటా నుంచి కనిపిస్తోంది.
ఎవరూ చనిపోయిన లేదా వేరు ప్రాంతాలకు వెళ్లిన పర్వాలేదని మేము చెప్పాము. కానీ మీరు ఎవరినైనా తొలగిస్తుంటే దయచేసి రూల్ 21, ఎస్ఓపీని అనుసరించాలి’’ అని ధర్మాసనం సూచించింది.
తొలగించబడిన ఓటర్ల జాబితాను కూడా ఎన్నికల కార్యాలయాలలో భద్రపరచాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించిన వాటిని అమలు చేయాలని గుర్తు చేసింది. తుది జాబితా కనిపిస్తోందని కానీ సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియలో గందరగోళం ఉందని జస్టిస్ బాగ్చీ అన్నారు. యాడ్ ఆన్ లో ఉన్నవి కొత్త పేర్లా లేక తొలగించిన వారి జాబితానా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈసీని ప్రశ్నించిన సింఘ్వీ..
న్యాయమూర్తి ప్రశ్నలకు పోల్ ప్యానెల్ తరఫున హజరైన న్యాయవాదీ సమాధానమిస్తూ... న్యాయస్థానానికి సమర్పించిన జాబితాలో ఎక్కువ భాగం కొత్త ఓటర్లే అని, కొంతమంది పాత ఓటర్లు ఉన్నారని కూడా తెలిపారు.
‘‘తొలగించబడిన ఓటర్లు ఎవరూ కూడా ఇప్పటి వరకూ ఎటువంటి ఫిర్యాదు లేదా అప్పీల్ దాఖలు చేయలేదు’’ అని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిందని, తుది ఓటర్ల జాబితా ప్రచుణను ఈ కేసులో విధిగా అమలు చేయవద్దని న్యాయవాదీ ప్రశాంత్ భూషణ్ కోర్టును కోరారు.
తమ పేర్లను అక్రమంగా తొలగించారని పేర్కొన్న వారు కోర్టుకు ఎందుకు హజరుకాలేదు లేదా అఫిడవిట్ దాఖలు చేయలేదని జస్టిస్ సూర్యకాంత్ ప్రశాంత్ భూషణ్ ను ప్రశ్నించారు. వచ్చే విచారణ నాటికి దాదాపు వందమందిని కోర్టులో హజరుపరుస్తానని ఆయన చెప్పారు.
ఓటర్ల తొలగింపులో ఈసీ రాజ్యాంగ, చట్ట నియమాలను పాటించలేదని సీనియర్ న్యాయవాదీ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. తొలగించిన వారి పేర్లను ఎందుకు తొలగించారో ఈసీ తెలియజేయలేదని సింఘ్వీ ఆరోపించారు. అయితే సింఘ్వీ వాదనలను ఈసీ తరఫున న్యాయవాదులు తోసిపుచ్చారు. ప్రతి ఓటర్ కు కారణాలు తెలిపామని వెల్లడించారు.
ముసాయిదా జాబితా నుంచి తొలగించబడిన ఎంతమంది ఓటర్లను తుది జాబితాలో తిరిగి చేర్చారనే దానిపై స్పష్టత లేదని పిటిషనర్లు ప్రశ్నించినప్పుడూ తుది జాబితాలో చేరిన వారిలో ఎక్కువ మంది కొత్త ఓటర్లే అని ఈసీ తరఫు న్యాయవాదీ అన్నారు.
బీహర్ లో రెండు దశలలో పోలింగ్..
సెప్టెంబర్ 30 న ఎన్నికలకు ముందు బీహార్ లో తుది జాబితాను ప్రచురించిన ఈసీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కి ముందు 7.89 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తుది ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 47 లక్షలు తగ్గి, 7.42 కోట్లకు చేరుకుందని తెలిపింది.
ఆగష్టు 1న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో పేరున్న 7.24 కోట్ల మంది ఓటర్ల నుంచి తుది సంఖ్య 17.87 లక్షలు పెరిగింది. దీని ప్రకారం మరణాలు, వలసలు, నకిలీ ఓటర్ల వివిధ కారణాలతో 65 లక్షల మంది ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.
ముసాయిదా జాబితాలో 21.53 లక్షల మంది కొత్త ఓటర్లు చేరగా, 3.66 లక్షల పేర్లు తొలగించారు. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తూ, 243 మంది సభ్యులు గల అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 122 నియోజకవర్గాలకు నవంబర్ 11న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగుతుంది.