హిమాచల్ బిజెపిలో కాంగ్రెస్ రెబెల్స్ పండగ...
హిమాచల్ ప్రదేశ్ లో అనర్హతవేటుకు గురైన ఆరుగురు కాంగ్రెస్ రెబెల్స్ కు బీజేపీ టికెట్లు ఇచ్చి పోటీకి నిలిపింది. ఇక్కడ వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలోని..
By : The Federal
Update: 2024-03-26 10:28 GMT
హిమాచల్ ప్రదేశ్‌లో అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీ టిక్కెట్‌పై ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్లతో పాటు ఆరుగురు తమ స్థానాలకు రాజీనామా చేసి గత వారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
కమలం పార్టీ లాహౌల్ స్పితి నుంచి రవి ఠాకూర్, ధర్మశాల నుంచి సుధీర్ శర్మ, సుజన్‌పూర్ నుంచి రాజిందర్ రాణా, గాగ్రెట్ నుంచి చైతన్య శర్మ, బర్సర్ నుంచి ఇందర్ దత్ లఖన్‌పాల్, కుట్లేహర్ నుంచి దేవిందర్ కుమార్ భుట్టోలను పోటీకి దింపింది. సార్వత్రిక ఎన్నికల ఏడో దశలో హిమాచల్‌లోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అదే రోజున జూన్ 1న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
హిమాచల్ సంక్షోభం
బడ్జెట్ సమయంలో అసెంబ్లీకి హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలన్న పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఫిబ్రవరి 29న ఆరుగురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హత, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామాలతో, ప్రస్తుత 59 మంది సభ్యుల అసెంబ్లీలో (అసెంబ్లీలో ఎమ్మెల్యే స్థానాలు 68) సభలో కాంగ్రెస్ బలం 39 నుంచి 33 కి తగ్గింది.
ప్రస్తుతం బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. బలపరీక్షలో టై అయితే మాత్రమే ఓటు వేయగల స్పీకర్ కాంగ్రెస్‌తో ఉన్నారు. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి రాష్ట్రం నుంచి ఏకైక రాజ్యసభ సీటును గెలుచుకుంది. దీంతో హిమాచల్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం మనుగడ సాగించినప్పటికీ రోజుల తరబడి రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం జరిగే ఉపఎన్నికలతో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.
బీజేపీ టార్గెట్
సుఖ్‌విందర్ సింగ్ సుఖు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఉపఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ నుంచి వలసలు ప్రారంభం అవుతాయి. దేశంలో కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అందులో కర్నాటక, తెలంగాణతో పాటు హిమాచల్ ఒకటి. ఇప్పటి వరకూ హిమాలయ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గత పోరుతో సతమతవుతోంది.