ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ స్పీకర్ అనర్హత వేటు వేశారు. కానీ క్రాస్ ఓటింగ్ కారణం చూపకుండా మరో అంశంపై ..
By : The Federal
Update: 2024-02-29 07:52 GMT
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో వారందరిపై అనర్హత వేటు వేసింది.
"కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ను ధిక్కరించి, కోత తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం, సభకు రాకపోవడం, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ( పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) రూల్ 2(1) ప్రకారం తక్షణమే వారిపై అనర్హత వేటు వేస్తున్నాం " అని స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ప్రకటించారు.
అయితే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయకుండా నిరాకరించిన కారణాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. కేవలం కాంగ్రెస్ విప్ ను ధిక్కరించిన కారణంగా మాత్రమే వారి ఎమ్మెల్యే సభ్యత్వం పై అనర్హత వేటు వేసినట్లు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ శాఖ వెల్లడించింది. అనర్హత వేటు పడిన వారిలో రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఐడీ లఖన్ పాల్, రవి ఠాకూర్, చైతన్య శర్మ, దవీందర్ భుట్టో ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అనర్హత వేటుతో రాష్ట్ర అసెంబ్లీ బలం 62 కి పడిపోయింది. సభ లో మ్యాజిక్ ఫిగర్ 32 కు చేరింది. సభ లో ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కు 34 మంది సభ్యుల మద్థతు ఉంది. అయితే కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మద్ధతు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఉంది.
బుధవారం హైడ్రామా
ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం, మరో వైపు మంత్రి విక్రమాదిత్య తన పదవికి రాజీనామా చేయడంతో బుధవారం అంతా హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడిందని వెంటనే శాసనసభలో బల నిరూపణ చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వెళ్లి గవర్నర్ ను కలవడంతో పరిస్థితి హీటెక్కింది.
తరువాత ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సఖూ రాజీనామా చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించింది. పరీశీలకులుగా కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, భూపిందర్ సింగ్ హూడా, భూపేష్ బఘేల్ ను హూటాహూటిన సిమ్లా పంపించింది. తరువాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తను రాజీనామా చేయలేదని ప్రకటించారు.
అంతకుముందు బడ్జెట్ ను ప్రభుత్వం వాయిస్ ఓటుతో ఆమోదించుకుంది. అయితే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళన చేశారు. అయితే దీనిని సీఎం కొట్టిపారేశారు. మరోవైపు తాను మంత్రి పదవి రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు వస్తున్న వార్తలపై కూడా విక్రమాదిత్య స్పందించారు. తాను తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.