కూతురు హత్య కేసులో జైలుకెళ్లొచ్చిన ఇంద్రాణీ ముఖర్జీ మళ్లీ తెరపైకి?

ఇంద్రాణీ ముఖర్జీ.. గుర్తుందా.. తన బిడ్డను స్వయానా ప్రియుడితో కలిసి చంపేసిందన్న ఆరోపణలపై జైలుకెళ్లి ఆ మధ్య బెయిల్ పై వచ్చిన మీడియా మొఘల్.

Update: 2024-10-22 12:52 GMT

ఇంద్రాణీ ముఖర్జీ.. గుర్తుందా.. తన బిడ్డను స్వయానా ప్రియుడితో కలిసి చంపేసిందన్న ఆరోపణలపై జైలుకెళ్లి ఆ మధ్య బెయిల్ పై వచ్చిన మీడియా మొఘల్. ఆమె మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇప్పుడు కొందరి నోట విమర్శలను మరికొందరి నోట ప్రశంసలను అందుకుంటున్నారు. ఆమె ఈసారి ఏకంగా ప్రముఖ జర్నలిస్టు, సాహితీవేత్త కుష్వంత్ సింగ్ పేరిట నిర్వహించిన లిటిరరీ ఫెస్టివల్ లో నృత్యప్రదర్శన ఇచ్చి ప్రముఖులకు టార్గెట్ అయ్యారు.

ఇంద్రాణి ఓ మీడియా ఛానల్ ను ప్రారంభించి ఓ వెలుగువెలిగారు. ఆసమయంలో ఆమె తన కుమార్తెను హత్య చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై సుదీర్ఘ కాలం దర్యాప్తు తర్వాత ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. తనకు అంత పెద్ద వయసున్న కుమార్తె ఉందని సమాజానికి తెలిస్తే తనను ఎంత పెద్ద వయసున్న వ్యక్తిగా భావిస్తోరనన్న ఫాల్స్ ప్రిస్టేజీతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. చాలా కాలం అదో సస్పెన్స్ త్రిల్లర్ గా ఆ ఎపిసోడ్ నడిచింది. ఆమె కుమార్తె పేరు షీనా బోరా. ఈమె హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఆమె హిమాచల్ ప్రదేశ్ లో అక్టోబర్ 21న జరిగిన కుష్వంత్ సింగ్ లిటిరరీ ఫెస్టివల్ లో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడది వివాదాస్పదమైంది. లిటిరరీ ఫెస్టివల్ లో ఆమె ప్యానలిస్టుగా కూడా ఉన్నారు.
ఇంద్రాణికి ఆ వేదికపై చోటు ఇవ్వడమేమిటని సోషల్ మీడియాలో కొందరు హోరెత్తిస్తున్నారు. దీంతో ఆర్గనైజర్లు సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. కొన్నేళ్ళ పాటు జైల్లో మగ్గి వచ్చిన ఆమెకు ప్రతిష్టాత్మకమైన వేదికపై నృత్య ప్రదర్శనకు చోటు ఇవ్వడం సరికాదని ఓ వర్గం వాపోతోంది.
ప్రతిష్టాత్మక సాహిత్య ఉత్సవంలో అదీ కుష్వంత్ సింగ్ పేరిట నిర్వహించిన ఉత్సవంలో ఇంద్రాణీ ప్రదర్శన చూసి నాకు కడుపులో దేవేసినట్టు అయిందని, వాంతి వచ్చినంత పనైందని మరో సాహిత్యకారుడు భట్టాచార్జీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యతో పలువురు మద్దతు పలికారు. అంతటి అత్యున్నత సాహిత్య సదస్సులో హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తికి చోటు ఇచ్చి నిర్వాహకులు ఏమి చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ మొత్తం ఈవేంటే ఓ కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు.
వికాశ్ చౌహాన్ అనే రచయిత ఇంకో అడుగు ముందుకు వేసి కుష్వంత్ సింగ్ అంతటి సాహితీవేత్త ఎక్కడ, ఈమె ఎక్కడ అని ప్రశ్నించారు. ఇటువంటి వేదికలపైకి స్పూర్తి ప్రధాతలను పిలుస్తారని భావించామే గాని వివాదాస్పద వ్యక్తులను, కుంభకోణాలు, హత్యల్లో ఇరుకున్న వారిని కాదని అన్నారు.
రజత్ అనే మరో సాహితీ వేత్త కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "మంచీ చెడులతో భారతీయ సమాజానికి పెద్దగా పట్టింపు లేనట్టు ఉంది. వాళ్లు ధనవంతులైతే చాలన్నట్టుగా ఉంది. ఇంద్రాణి సంపన్నురాలు గనుక ఆమెపై మర్డర్ కేసున్నా ఆమెకు ఈ వేదికపై ఛాన్స్ దక్కింది" అన్నారు.
నెట్ ఫిక్స్ డాక్యుమెంటరీ సీరీస్ లో ఇంద్రాణీపై ఓ ఫిలిం ఉంది. ఆమె తన 25 ఏళ్ల కుమార్తె షీనా బోరాను 2012లో హత్య చేసినట్టుగా అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు చూపిస్తారు. అది ఇంకా ఆరోపణే గనుక అప్పుడే ఆమెను దోషిగా చెప్పలేం గాని సాహిత్య ఉత్సవ నిర్వాహకులకు ఇది నైతికమా అనైతికమా అనే సందేహం రావాలి కదా అన్నది మరికొందరి వాదన.
ఎవరీ ఇంద్రాణీ ముఖర్జీ..
ఇంద్రాణీ ముఖర్జియా ఓ మీడియా సంస్థ ఎగ్జిక్యూటివ్. ఆ తర్వాత ఆమె తన సంస్థను వేరేవారికి అమ్మేశారు. 2012లో ఆమె కుమార్తె షీనా బోరా హత్యకు గురయ్యారు. అందులో ఆమె పాత్ర ఉందంటూ మీడియా కోడై కూసింది. హత్య జరిగిన మూడేళ్ల తర్వాత ఆ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. షీనా బోరా హత్యకు కుట్ర చేసిందే ఇంద్రాణీ అని, తప్పుడు సమాచారం ఇచ్చారని, కిడ్నాప్ డ్రామా ఆడారని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో ఆమె అరెస్ట్ అయి ఏడేళ్ల పాటు జైల్లో ఉన్నారు. 2022 మే 18న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంద్రాణీ ముఖర్జియాకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఈ ఏడాది మొదట్లో ఆమె విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు సాహిత్య సదస్సులో తణుక్కున మెరిశారు.
ఇంతకీ ఆమె ఇచ్చిన ప్రదర్శన ఏమిటీ..
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలి లిటిరరీ ఫెస్టివల్ లో ఇంద్రాణి ముఖర్జియా నృత్య ప్రదర్శన నాట్యం పట్ల ఆమెకున్న ప్రతిభను చాటి చెప్పేలా ఉందన్నది కొందరి అభిప్రాయం. ఈ ప్రదర్శనకు సందీప్ సోపర్కర్ దర్శకత్వం వహించారు. ఇంద్రాణి కొత్తగా ప్రారంభించిన ‘ఇంద్రాణి ముఖర్జీ ఎంటర్‌ప్రైజ్’ బ్యానర్‌పై నిర్మించబడింది. తన జీవితానుభవాల ఆధారంగా ఈ ప్రదర్శనను రూపొందించినట్టు చెబుతున్నారు. ఇంద్రాణి ముఖర్జీ పౌరాణిక పాత్ర 'ఫీనిక్స్'గా కనిపిస్తారు. సూర్య భగవానుడి పట్ల ఎనలేని ప్రేమ ఉండే పాత్ర అది. 50 నిమిషాల నృత్య రూపకం అది. ఫీనిక్స్ అంటే బూడిద నుంచి పైకి లేచిన పక్షిగా చెబుతారు. తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ముఖర్జీ. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రిసిలెన్స్ అండ్ రెన్యూవల్' పేరిట తన వ్యక్తిగత జీవితం ఆధారంగా రూపొందించారు.
ముఖర్జీ మాట్లాడుతూ, “నేను ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఉపయోగించిన ట్యాగ్‌లైన్ ‘ఫీనిక్స్. అది బూడిద నుండి పైకి లేస్తుంది. ఇప్పుడు నా నృత్య రూపకం కూడా అలాంటిదే.’ యాదృచ్ఛికమే కావొచ్చు గాని ఈ లిటిరరీ ఫెస్టివల్ థీమ్‌తో సరిపోలింది. నేను నా జీవితాన్ని అదే పద్ధతిలో జీవించినందున నేను పూర్తి శక్తిని అందుకు ఇవ్వగలిగాను అంటారు ఆమె.
ఆమె శ్రద్ధను, నిబద్ధతను ఆమె గురువు సోపర్కర్ ప్రశంసించారు. ఇంద్రాణి అపురూపమైన అంకితభావం గల విద్యార్థిని అని పొగిడారు. ముఖర్జీ వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాలను ఆమె ఈ నృత్యరూపకాన్ని మరింత బాగా తీసుకువచ్చేందుకు పనికి వచ్చాయి అన్నారు సోపర్కర్.
2022లో జైలు నుంచి బయటికి వచ్చిన ఆమె అనతి కాలంలోనే నృత్యకారిణిగా మారడం గమనార్హం.
Tags:    

Similar News