జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదా రావాల్సిందే: అసెంబ్లీ తీర్మానం

కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం రద్దు చేసిన అధికరణ 370 ని తిరిగి తీసుకురావాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే బీజేపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం..

Update: 2024-11-06 10:56 GMT

జమ్మూకాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా, అలాగే రద్దు చేసిన అధికరణ 370, 35 ఏ ను పునరుద్దరణ చేయాలని జమ్మూకాశ్మీర్ శాసన సభ తీర్మానం ఆమోదించింది. తీర్మానం ఆమోదం పొందిన తరువాత బుధవారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు స్పీకర్ వెల్ ను ముట్టడించారు.

ఆందోళనలతో స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ సభను మొదట 15 నిమిషాలు వాయిదా వేశారు. అయితే, అసెంబ్లీ మళ్లీ సమావేశమైన వెంటనే బీజేపీ సభ్యులు తమ నిరసనను కొనసాగించి స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతూ.. ‘మీరే (స్పీకర్) నిన్న మంత్రుల సమావేశాన్ని పిలిచి తీర్మానాన్ని మీరే రూపొందించారని మాకు నివేదికలు ఉన్నాయి’ అని అన్నారు.

అయితే, నిరసన తెలుపుతున్న బిజెపి సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ కోరారు. నిరసనల మధ్యే స్పీకర్ LG ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు NC ఎమ్మెల్యే జావైద్ హసన్ బేగ్‌ను పిలిచారు. అయితే గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మళ్లీ గంటపాటు వాయిదా వేశారు

ప్రత్యేక హోదాపై తీర్మానం..
అంతకుముందు, అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే, JK ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి JK ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని సమర్పించారు.
"జమ్మూ కాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి, హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదా, రాజ్యాంగ హామీల ప్రాముఖ్యతను ఈ శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. కేంద్ర ఏకపక్ష తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది" అని చౌదరి ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. "
పునరుద్ధరణ కోసం ఏదైనా ప్రక్రియ జాతీయ ఐక్యత, జమ్మూ కాశ్మీర్ ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలు రెండింటినీ కాపాడాలని ఈ అసెంబ్లీ కోరుకుంటోంది" అని తీర్మానంలో ప్రతిపాదించారు. పిడిపి, పీపుల్స్ కాన్ఫరెన్స్, సిపిఐ(ఎం) సభ్యులు కూడా వాయిస్ ఓటింగ్ సందర్భంగా తీర్మానానికి మద్దతు పలికారు.
బీజేపీ సభ్యులు నిరసన..
ప్రతిపక్ష నేత సునీల్ శర్మతో సహా బిజెపి సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు, ఇది శాసనసభ సమావేశాలలో పెట్టడం తగదన్నారు. “మేము తీర్మానాన్ని తిరస్కరిస్తున్నాము. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగడం మాకు ఇచ్చిన బిజినెస్ అడ్వయిజరీలో పేర్కొన్నారు” అని ఆయన అన్నారు. ఇక్కడ తీర్మానం తీసుకురావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా శాసనసభకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "దేశంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేవాలయం (పార్లమెంట్) ఈ చట్టాన్ని ఆమోదించింది," అన్నారాయన.
అలజడి
శర్మ చేసిన వ్యాఖ్యలు అధికార పక్షం నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం కల్పించాలని బీజేపీ కూడా నిరసనలకు దిగింది. బీజేపీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి పావులు విసిరారు. తోపులాటల మధ్య ఎమ్మెల్యే లంగేట్‌ షేక్‌ ఖుర్షీద్‌ వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అసెంబ్లీ మార్షల్స్‌ అడ్డుకున్నారు.
తీర్మానాన్ని ఆమోదించాలంటూ ఎన్‌సీ సభ్యులు నినాదాలు చేశారు. బీజేపీ సభ్యులు సభకు పరువు తీశారని బందిపొరా కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజాముద్దీన్ భట్ అన్నారు. "వారు నిబంధనలను ఉల్లంఘించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై మాట్లాడే హక్కు ప్రతి సభ్యునికి ఉందని భట్ అన్నారు. అయితే బీజేపీ సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. గందరగోళం మధ్య, స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకూడదనుకుంటే, "నేను దానిని ఓటింగ్ కు పెడతాను" అని అన్నారు. అయితే గందరగోళం మధ్యే వాయిస్ ఓటింగ్ నిర్వహించి తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. తరువాత బీజేపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. నిరసనలతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ఆర్టికల్ 370 రద్దు
మోదీ ప్రభుత్వం 2019లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. పూర్వపు రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్‌గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. పది సంవత్సరాల తరవాత జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో హంగ్ ఏర్పడింది. కానీ స్వతంత్రుల సహాయంతో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


Tags:    

Similar News