కథువా క్లౌడ్ బరస్ట్: కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురి మృతి
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు;
By : The Federal
Update: 2025-08-17 11:45 GMT
జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రెండు క్లౌడ్ బరస్ట్ సంఘటనలో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఇక్కడ సహాయక కార్యక్రమాల కోసం సైన్యం హెలికాప్టర్లను మోహరించింది.
రాజ్ బాఘ్ లోని జోధ్ ఘాటి గ్రామం, జాంగ్ లోట్ లోని పలు ప్రాంతాలలో రాత్రిపూట కుంభ వృష్టి కురవడంతో ఈ విపత్తు సంభవించింది. జమ్మూకాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలోని చిసోటి గ్రామాన్ని ఆకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి.
కథువా జిల్లాలో కురిసిన ఈ భారీ వర్షాలకు 60 మంది మరణించారు. మరో 100 మంది వరకూ గాయపడ్డారు. కథువా జిల్లా అభివృద్ది కమిషనర్ రాజేశ్ శర్మ, సీనియర్ సివిల్, పోలీస్ అధికారులు కథువాలోని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
సైన్యం బరిలోకి..
వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి సైన్యాన్ని ప్రభుత్వం మొహరించింది. ఘాట్టిలోని సహాయక చర్యల కోసం మోహరించిన ఆర్మీ హెలికాప్టర్ లో 15 మందిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ధ్రువ్ హెలికాప్టర్లు కూడా గాయపడిన వారిని పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఉన్న ఆస్పత్రికి తరలించాయి.
రైజింగ్ స్టార్ కార్ప్ కు చెందిన పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానికులతో కలిసి కుటుంబాలను రక్షించడానికి, ఆహారం, వైద్య సంరక్షణను అందించడానికి పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. కథువా జిలలా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ రాజేశ్ శర్మ తెలిపారు.
‘‘కతువా జిల్లాలో భారీ వర్షపాతం గణనీయమైన నష్టాన్ని కలిగించింది. దురదృష్టవశాత్తూ మేమూ కూడా ప్రాణాలు కోల్పోయాము. ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఏడుగురు గాయపడ్డారు. జాంగ్లోట్ లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కనెక్టీవిటీ కోల్పోయినప్పటికీ వస్తువులను మాత్రం నిరంతరం సరఫరా చేస్తూనే ఉన్నాము. వాయుమార్గం ద్వారా సామగ్రిని అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆయన తెలిపారు.
జోధ్ ఘాటీలో ఐదుగురు..
జోధ్ ఘాటీలో భారీ వర్షాల కారణంగా ఐదుగురు మరణించారు. గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిఇళ్లకు నష్టం వాటిల్లింది. జాంగ్లోట్ ప్రాంతంలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
జోధ్ ఘాటీ నుంచి ఐదుగురిని ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, స్థానిక స్వచ్చంద సేవకులు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వారు తెలిపారు.
అమిత్ షా, సీఎం జేకే ఎల్జీతో మాట్లాడారు..
కథువాలో జరిగిన తుఫాన్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జమ్మూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడి కేంద్రం నుంచి అన్ని రకాల మద్దతు లభిస్తుందని హమీ ఇచ్చారు.
‘‘కతువాలో జరిగిన వర్షాల కారణంగా కారణంగా జమ్మూకాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి తో మాట్లాడాను. స్థానిక పరిపాలన సహాయ చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మోదీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల మద్దతు లభిస్తుందని హమీ ఇస్తున్నాము. జమ్మూకాశ్మీర్ లోన మా సోదరిమణులు, సోదరులకు మేము దృఢంగా మద్దతు ఇస్తున్నాము’’ ని అమిత్ షా ఎక్స్ లో ట్వీట్ చేశారు.
సీఎం సంతాపం..
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చనిపోయిన వారిపట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, ఉపశమనం, తరలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
‘‘జోధ్ ఖాడ్, జుతానాతో సహ కథువాలోని అనేక ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం వలన జరిగిన విషాదకరమైన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.
మృతుల కుటుంబాలకు ఆయన హృదయపూర్వక సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వారికి అవసరమైన అన్ని సాయాలను అందిస్తామని హమీ ఇచ్చారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో తెలిపింది.
చనిపోయిన వారి కుటుంబాలకు ఎస్డీఆర్ఎఫ్ మద్దతు పాటు, సీఎం సహాయక నిధి నుంచి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందిస్తామని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు లక్ష రూపాయాలు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 25 వేల చొప్పున సాయం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కథువాలో రక్షణ, సహాయ కార్యకలాపాలను నిర్వహించడానికి పౌర పరిపాలన, సైనిక, పారామిలిటరీ దళాలు వేగంగా చర్యలు చేపట్టాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా చాలా జలాశయాలలో నీటిమట్టం గణనీయంగా పెరిగిందని, ఉజ్ నదీ ప్రమాదస్థాయికి దగ్గరగా పరుగులు పెడుతోందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, ప్రజలు తమ భద్రత కోసం నీటి వనరులకు దూరంగా ఉండాలని కోరినట్లు అధికారులు తెలిపారు.