ఓడిపోతే కుంగిపోము.. గెలిస్తే పొంగిపోము: ఆర్జేడీ
తమది పేద ప్రజల గొంతుక అని ట్వీట్
By : The Federal
Update: 2025-11-15 11:37 GMT
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష ఆర్జేడీకి షాక్ తగిలిన తరువాత పార్టీ తొలిసారిగా స్పందించింది. ప్రజా సేవలో గెలుపోటములు సహజం అని, ఓడిపోతే కుంగిపోకుండా, గెలిస్తే పొంగిపోకుండా ఉండటమే ముఖ్యమని పేర్కొంది.
‘‘ప్రజా సేవ అనేది ఒక నిరంతర ప్రక్రియ, అంతులేని ప్రయాణం. అందులో హెచ్చుతగ్గులు అనివార్యం, ఓడిపోతే కుంగిపోకుండా, గెలిస్తే అహంకరించకుండా ఉండటమే అసలు విజయం’’ అని ఆర్జేడీ ఎక్స్ లో ట్వీట్ చేసింది. ఆ పార్టీ 143 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో క్యాడర్ మొత్తం డీలాపడింది.
తనకు తాను పేదల పార్టీగా అభివర్ణించుకున్నా ఆర్జేడీ, పేదల ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటుందని పేర్కొంది. ‘‘రాష్ట్రీయ జనతాదళ్ పేదల పార్టీ, పేద ప్రజల గొంతును వినిపిస్తూనే ఉంటుంది’’ అని అది ట్వీట్ లో పేర్కొంది.
23 శాతం ఓట్లు.. కానీ 25 సీట్లు మాత్రమే..
బీహార్ లో కాంగ్రెస్, ఇతర కూటములతో జట్టుకట్టిన ఆర్జేడీ మహాఘట్ బంధన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియలో మాత్రం చతికిలపడింది. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార పక్షానికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
అయితే బీహార్ లో పోటీ చేసిన అన్ని రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదు చేసింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ మొత్తం 23 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది.
2020 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 144 స్థానాలలో పోటీ చేసి, 23.11 శాతం ఓట్లను రాబట్టింది. గతకంటే కాస్త ఓట్ల శాతం తగ్గినప్పటికీ సీట్ల సంఖ్యలో మాత్రం భారీ వ్యత్యాసం కనపరిచింది.
బీజేపీ 2020 లో 19.46 శాతం ఓట్లను కైవసం చేసుకోగా, తాజా ఎన్నికలలో 20.07 శాతానికి పెంచుకుంది. గతంలో ఆ పార్టీ 110 స్థానాలలో పోటీకి దిగింది. తాజాగా 101 సీట్లలోనే తన అభ్యర్థులను పోటీకి నిలిపింది.
రెండో స్థానంలో ఆర్జేడీ..
ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే అనేక నియోజకవర్గాలలో పార్టీ రెండు, మూడో స్థానంలో నిలిచింది. బీజేపీ, జేడీయూ కంటే 42 స్థానాలలో ఎక్కువగా పోటీ చేయడం వలన కూడా అది తన ఓటింగ్ శాతం పెంచుకోవడానికి మరొక కారణం.
ఆర్జేడీకి మొత్తం 1,15,46,055 ఓట్లు రాగా, బీజేపీకి 1,00,81,143 ఓట్లు పోలైయ్యాయి. మహఘట్ బంధన్ లోని ఇతర పక్షాలు కూడా ఘోరమైన ప్రదర్శన చేశాయి. కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేయగా ఆరు మాత్రమే గెలుచుకుంది. సీపీఐ(ఎంఎల్) రెండు, సీపీఐ(ఎం) ఒకటి, సీపీఐ ఖాతా తెరవకపోవడం తో అది మొత్తంగా కేవలం 35 స్థానాల దగ్గరే తన పరుగును ఆపివేసింది. లోక్ జన్ శక్తి 19, హెచ్ఏఎం ఐదు, ఆర్ఎల్ఎం నాలుగు సీట్లు గెలుచుకున్నాయి.