పరిస్థితి ఇంకా అదుపులోనే ఉంది: యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్
ఎంతమంది మరణించారో అధికారికంగా వెల్లడించని ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-01-29 08:11 GMT
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని వస్తున్న వార్తలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడారు. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఎలాంటి నకారత్మక చర్యలు జరగలేదని వెల్లడించారు. జాతీయ మీడియాలోని కొన్ని సంస్థల నివేదిక ప్రకారం దాదాపుగా పది మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ వివరాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు.
పోటెత్తిన భక్తులు..
ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాకు బుధవారం కోట్లాది మంది భక్తులు పొటెత్తారు. అత్యంత విశేషమైన ‘మౌనీ అమావాస్య’(చొల్లంగి అమావాస్య) కావడం, పితృదేవతలకు పూజలు చేసేందుకు మంచి సమయం కావడమని భక్తులు విశ్వసించడంతో దాదాపుగా పది కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు తరలివచ్చారు.
ఈ సందర్భంగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో సెక్టార్ రెండులోని బారీకేట్లు భక్తుల ఒత్తిడిని తట్టుకోలేక విరిగిపోయాయి. దీనితో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది భక్తులు బారికేడ్లను ఎక్కి వెళ్లడానికి ప్రయత్నం చేయడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ సంఘటనలో దాదాపు 50 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వీరందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మీడియా సంస్థల్లో తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు మరణించినట్లు, వారికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేసినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. యూపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక లెక్కలు ఇవ్వలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని, హోంమంత్రి అమిత్ షా యూపీ సీఎం కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు రావడంతో అన్ని అఖాడాలు ఈ రోజు చేయాల్సిన తమ పుణ్యస్థానాలను వాయిదా వేసుకున్నాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలాంటి వీఐపీ సేవలు అందించడం లేదని పేర్కొంది.
మరో వైపు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ కు రావడంతో ఆ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రైల్వే శాఖ కూడా 300 కి పైగా ప్రత్యేక రైళ్లను ఇప్పటికే నడుపుతోంది. అయితే ఈ దుర్ఘటనతో అన్ని రైళ్లను దూర ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నిలిపివేశారు.
సంఖ్య తెలియదు: అధికారులు
సంగమ ప్రదేశం వద్ద బారికేడ్లు విరిగిపోవడంతో కొంతమంది గాయపడటంతో ఆస్పత్రికి తరలించినట్లు స్పెషల్ డ్యూటీ అధికారి ఆకాంక్ష రాణా జాతీయ మీడియాకు తెలిపారు. అయితే ఎంతమంది గాయపడ్డారో సంఖ్య తనకు తెలియదని వెల్లడించారు. బాధితులను ఆస్పత్రికి తరలించగానే పలువురు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని వారి క్షేమ సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు.
‘‘ మేము రెండు బస్సుల్లో 60 మంది దాకా వచ్చాము. ఈ గ్రూపులో తొమ్మిది మంది ఉన్నాము. అకస్మాత్తుగా తోపులాట జరిగింది. మేము అందులో చిక్కుకున్నాం. చాలా మంది కింద పడిపోయారు. రద్దీ విపరీతంగా ఉంది.’’ అని కర్ణాటకకు చెందిన సరోజిని ఏడుస్తూ చెప్పారు. అక్కడ తప్పించుకోవడానికి దారి కనిపించలేదని, అన్ని వైపుల ఆశేషమైన జనమే ఉన్నారని పేర్కొన్నారు.