గవాయ్ పై షూ విసిరిన లాయర్ రాకేశ్ పై వేటు

కోర్టు ఎంట్రీ కార్డును రద్దు చేసిన బార్ అసోసియేషన్

Update: 2025-10-09 10:20 GMT
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి కేసు కొత్త మలుపు తీసుకుంది. గవాయ్ పై బూటు విసిరిన 71 ఏళ్ల లాయర్ రాకేశ్ కిషోర్ ను బహిష్కరించాలని సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆయన కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.

అక్టోబర్ 6న సుప్రీం కోర్టులో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కోర్టు నెంబర్‌ 1 హాల్‌లో.. కేసుల మెన్షనింగ్‌ జరుగుతున్న సమయంలో రాకేశ్ కిషోర్ అనే లాయర్ తన కాలి బూటు తీసి సీజేఐ గవాయ్ వైపు విసిరాడు. అది గవాయ్ కూర్చున్న కుర్చీకి కుడివైపు తగలినట్టు బయటికి వచ్చిన వీడియోలలో కనిపించింది. దీంతో తోటి లాయర్లు ఆ వ్యక్తిని పట్టుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. అయితే.. ఇలాంటి చర్యలు తనని ప్రభావితం చేయలేవన్న జస్టిస్‌ గవాయ్‌.. కోర్టు కలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.
దాడి అనంతరం లాయర్ రాకేశ్ కిషోర్ ను బయటకు తీసుకువ్న సమయంలో ‘సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం’ అంటూ నినాదాలు చేశాడు. సీజేఐ సూచనతో అతనిపై పోలీసులకు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేయలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని మూడు గంటలపాటు విచారించి షూతో పాటు అతని పేపర్లు ఇచ్చి వదిలేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్‌ కిషోర్‌గా నిర్ధారించారు. అయితే..దాడికి ప్రయత్నించినందుకుగానూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాకేష్‌ కిషోర్‌(Rakesh kishore)పై చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కోర్టు, ట్రిబ్యునల్, అధికార సంస్థల్లో ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. జరిగిన ఘటనపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. దాడిని సమర్థించుకున్న రాకేష్‌ కిషోర్‌ 'అదంతా దైవ నిర్ణయమని' అంటున్నారు. తన నుంచి కనీస వివరణ తీసుకోకుండానే సస్పెండ్‌ చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పు బడుతూ పలు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు.
ఈనేపథ్యంలో సస్పెండెడ్‌ లాయర్‌ రాకేష్‌ కిషోర్‌పై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. సీజేఐపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ.. ఆల్‌ ఇండియా అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు భక్తవత్సల ఫిర్యాదు చేశారు. దీంతో విధానసౌధ పీఎస్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో ఢిల్లీకి కేసు బదిలీ కానుంది.
Tags:    

Similar News