అన్ని లక్షల మంది ఓటర్లు ఎలా వచ్చారు: రాహుల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం అదనంగా 39 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్న ప్రతిపక్ష నేత;
By : The Federal
Update: 2025-02-07 10:04 GMT
మహారాష్ట్ర ఎన్నికల్లో తమ ఓటమికి కారణం దొంగ ఓట్లే అని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరోక్షంగా ఆరోపించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో, కేవలం నాలుగు నెలల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల లెక్కలలో తేడాలున్నాయని అన్నారు.
కేవలం నెలల వ్యవధిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఓటర్ల జాబితాలోకి 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా వచ్చారని, ఇదేలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఆయన లోక్ సభలో డిమాండ్ చేశారు.
‘‘2019 లో జరిగిన విధాన సభ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల మధ్య మహారాష్ట్రంలో మొత్తం 32 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. అయితే కిందటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటి జాబితాకు, తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి దాదాపు 39 లక్షల మంది అదనంగా జాబితాలో చేరారు.
ఇన్ని లక్షల మంది ఎవరూ? ఈ సంఖ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల జాబితాకు సమానం. రెండో విషయం ఏంటంటే.. రాష్ట్ర జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు.’’ అని రాహుల్ ప్రశ్నించారు.
తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంటనే ఎన్నికల సంఘం ప్రతిపక్ష పార్టీల అనుమానాలు తీర్చాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరుగుతున్నాయని నిరూపించుకోవలని అన్నారు.