రైతు నిరసన ఉద్యమానికి మద్ధతు తెలిపిన ఒలంపిక్ రెజ్లర్

ఢిల్లీ - హర్యానా సరిహద్దులో 200 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమానికి ఒలంపిక్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ మద్దతు ప్రకటించారు.

Update: 2024-08-31 08:06 GMT

ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ శనివారం (ఆగస్టు 31) హర్యానా-ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొన్నారు. అన్ని పంటలకు కనీస మద్ధతు ధర ఇవ్వాలని రైతులు 200 రోజుల నుంచి ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు. 

“వారు ఇక్కడ కూర్చొని 200 రోజులైంది. ఇది చూస్తుంటే బాధగా ఉంది. వీరంతా ఈ దేశ పౌరులే. రైతులు దేశాన్ని నడుపుతున్నారు. వారు లేకుండా ఏదీ సాధ్యం కాదు, అథ్లెట్లు కూడా కాదు. వారు మాకు ఆహారం ఇవ్వకపోతే, మేము పోటీ పడలేము. చాలా సార్లు మనం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటాము’’ అని వినేష్ ఫొగాట్ అన్నారు.
దేశానికి ఏ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబాలను విచారంగా చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. వారి డిమాండ్లను వినాలని ప్రభుత్వాలను నేను కోరుతున్నాను. గత సారి తమ తప్పును ఒప్పుకున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రజలు ఇలా వీధుల్లో కూర్చుంటే దేశం పురోగమించదు" అని వినేష్ ఫోగట్ అభిప్రాయపడ్డారు. ఆమెను రైతులు సన్మానించారు. ఖానౌరీ, శంభు మరియు రతన్‌పురా సరిహద్దుల్లో శనివారం నిరసనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
మోదీ ప్రభుత్వంపై..
సార్వత్రిక ఎన్నికలకు ముందు రైతులు ఢిల్లీలో నిరసనలు చేయాలని బయల్దేరారు. అయితే ఫిబ్రవరి 13న హర్యానా రాష్ట్ర సరిహద్దు శంభకు చేరుకోగానే భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. రైతులు శంభు సరిహద్దు దగ్గరే బైఠాయించారు. మోదీ ప్రభుత్వం తమ దృఢ సంకల్పాన్ని పరీక్షిస్తోందని, తమ డిమాండ్లు ఇంకా నెరవేరలేదని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ఆరోపించారు.
"మేము మా డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తాము. కొత్త ప్రకటనలు కూడా చేస్తాం" అని పంధర్ ఇండియా టుడే టీవీతో అన్నారు.
కంగనా పై చర్యలు తీసుకోండి
తమపై పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కంగనాకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) గట్టి వైఖరి తీసుకోవాలని వారు కోరారు. బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Tags:    

Similar News