ప్రచారాన్ని తిరస్కరించి, పనితీరుకు ఓటేశారు: మోదీ
లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ప్రచారాలను తిరస్కరించి, పార్టీల పనితీరు ఆధారంగా ఓటు వేశారని ప్రధాని మోదీ అన్నారు.
By : The Federal
Update: 2024-07-03 09:02 GMT
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పార్టీల పనితీరును చూసి ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రచార ఆర్భాటాన్ని తిరస్కరించారని చెప్పారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానమిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఓడిపోయాయని పేర్కొన్నారు.
'రాజ్యాంగం ముఖ్యం'
రాజ్యాంగం కేవలం అధికరణాల సంకలనం కాదని, దాని స్ఫూర్తి, మాటలు కూడా చాలా ముఖ్యమైనవని బీజేపీ భావించిందని, రాజ్యసభలో చేసిన తన ప్రసంగంలో మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతుందని ఆయన అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారి అని అన్నారు.
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ ఐదో స్థానం నుంచి భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఎన్నికల తీర్పు అని ప్రధాని అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా దేశం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆటో పైలట్ విధానంలో ప్రభుత్వాన్ని నడిపిన వారు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేయగలరని ఆయన అన్నారు.
సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఇండి కూటమి సభ్యులు నిరసన వ్యక్తం చేశాయి. నినాదాలతో పదే పదే అడ్డంకులు సృష్టించాయి. చివరకు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయాయి. విపక్షాలు సభలో మర్యాదను విడిచిపెట్టి వెళ్లిపోయారని చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభం కాగానే హాత్రాస్ మృతులపై నివాళులర్పించింది. దొంగ బాబాలను అరికట్టాలని ఈ సందర్భంగా విపక్ష నేత ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు.